కప్పు కొట్లాటలో...

previous history of cricket world cup - Sakshi

మూడుసార్లు ఇంగ్లండ్, ఒకసారి కివీస్‌ విఫలం

తొలిసారి ఫైనల్లో తలపడుతున్న రెండు జట్లు

ఎవరి కల నెరవేరినా చరిత్రే

44 ఏళ్ల వన్డే ప్రపంచ కప్‌ చరిత్రలో ఐదు జట్లే (వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటివరకు చాంపియన్లుగా నిలిచాయి. పెద్ద టోర్నీల్లో తేలిపోయే దురదృష్ట దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగతా వాటిలో కచ్చితంగా జగజ్జేతగా నిలిచే సత్తా ఉన్నవి ఇంగ్లండ్, న్యూజిలాండ్‌. అయితే, వీటి పోరాటం ఇన్నాళ్లూ సెమీఫైనల్లోనో, ఫైనల్లోనో ముగిసింది. ఇక ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. కొత్త చాంపియన్‌ ఆవిర్భావానికి వేదిక సిద్ధమవుతోంది. సరికొత్త చరిత్ర నమోదుకు కాలం వేచి చూస్తోంది. మరి ఈ జట్ల గత ఫైనల్‌ ప్రస్థానం ఎలా ఉందంటే?  

సాక్షి క్రీడా విభాగం
ఇంగ్లండ్‌ మూడుసార్లు 1979, 1987, 1992లో న్యూజిలాండ్‌ 2015లో ప్రపంచ కప్‌ చివరి మెట్టు వరకు వచ్చాయి. ఇంగ్లిష్‌ జట్టు... వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ చేతిలో పరాజయం పాలై విశ్వ విజేతగా నిలిచే అవకాశం చేజార్చుకుంది. కివీస్‌ను గత కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం ఓ విశేషమైతే... 12వ ప్రపంచ కప్‌ ద్వారా 23 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్‌ను ప్రేక్షకులు చూడబోతుండటం మరో విశేషం. చివరి సారిగా 1996లో (శ్రీలంక) ఓ కొత్త జట్టు జగజ్జేత అయింది.

ఇంగ్లండ్‌ ఆ మూడుసార్లు ఇలా...
క్రికెట్‌ పుట్టిల్లయిన ఇంగ్లండ్‌ ఇంతవరకు వన్డేల్లో విశ్వవిజేత కాలేకపోవడం ఆశ్చర్యమే. మంచి ఫామ్, గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా ఆ జట్టు మిగతా దేశాలతో పోటీలో వెనుకబడిపోయింది. వీటిలో సంప్రదాయ టెస్టు తరహా ఆటను విడనాడకపోవడం మొదటిది. కాలానికి తగ్గట్లు మారకపోవడం రెండోది. ఇప్పుడు వాటిని ఛేదించి అమీతుమీకి సిద్ధమైంది. గతంలోని మూడు విఫలయత్నాలను గమనిస్తే...

వివ్‌ విధ్వంసంలో కొట్టుకుపోయింది...
వరుసగా రెండోసారి ఆతిథ్యమిచ్చిన 1979 కప్‌లో ఇంగ్లండ్‌ గ్రూప్‌ మ్యాచ్‌లన్నిటిలో అజేయంగా నిలిచింది. కెప్టెన్‌ మైక్‌ బ్రియర్లీ, బాయ్‌కాట్‌ వంటి ఓపెనర్లతో, కుర్రాళ్లు గూచ్, బోథమ్, డేవిడ్‌ గోవర్‌లతో టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించింది. సెమీస్‌లో గట్టి పోటీని తట్టుకుని 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. తుది సమరంలో మాత్రం భీకర వెస్టిండీస్‌కు తలొంచింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం ఓ తప్పిదం కాగా... విధ్వంసక వివ్‌ రిచర్డ్స్‌ (157 బంతుల్లో 138 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆతిథ్య జట్టును చితక్కొట్టాడు. కొలిస్‌ కింగ్‌ (66 బంతుల్లో 86; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి అండగా నిలవడంతో కరీబియన్లు నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. ఛేదనలో బ్రియర్లీ (64), బాయ్‌కాట్‌ (57) అర్ధ సెంచరీలతో మంచి పునాది వేసినా జోయల్‌ గార్నర్‌ (5/38) ధాటికి గూచ్‌ (32) మినహా మిగతావారు విఫలమయ్యారు. వీరు కాక రాండల్‌ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయడంతో ఇంగ్లండ్‌ 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 92 పరుగుల తేడాతో ఓడి కప్‌ను చేజార్చుకుంది.

గాటింగ్‌ షాట్‌తో గూబ గుయ్‌...
భారత్‌ ఆతిథ్యమిచ్చిన 1987 కప్‌లో గ్రూప్‌ దశలో రెండుసార్లు (ఫార్మాట్‌ ప్రకారం) పాకిస్తాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌... శ్రీలంక, వెస్టిండీస్‌లపై అజేయ విజయాలతో సెమీస్‌ చేరింది. సెమీస్‌లో నాటి డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌పై 35 పరుగులతో నెగ్గింది. ఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను 50 ఓవర్లలో 253/5 కు కట్టడి చేసింది. గూచ్‌ (35), అథె (58)కు తోడు కెప్టెన్‌ గాటింగ్‌ (41), అలెన్‌ లాంబ్‌ (45) రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే, 135/2తో ఉన్న దశలో గాటింగ్‌ అత్యుత్సాహ రివర్స్‌ స్వీప్‌ సీన్‌ను రివర్స్‌ చేసింది. స్కోరు 177 వద్ద అథెను ఔట్‌ చేసిన ఆసీస్‌ బౌలర్లు పట్టుబిగించి ఇంగ్లండ్‌ను 50 ఓవర్లలో 246/8కే పరిమితం చేశారు. కప్‌నకు అతి దగ్గరగా వచ్చిన ఇంగ్లండ్‌ ఏడు పరుగుల తేడాతో కోల్పోయింది.

పాక్‌ ప్రతాపాన్ని తట్టుకోలేక...
ఆ వెంటనే జరిగిన 1992 కప్‌లో రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. వర్షం రూపంలో అదృష్టం కలిసివచ్చి సెమీస్‌లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. అటువైపు ప్రత్యర్థి పాకిస్తాన్‌ కావడంతో ఇంగ్లండ్‌దే కప్‌ అని అంతా అనుకున్నారు. కానీ, పాక్‌ పట్టువిడవకుండా ఆడి ఇంగ్లండ్‌ కలను చెదరగొట్టింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (72), జావెద్‌ మియాందాద్‌ (58) అర్ధసెంచరీలు, ఇంజమామ్‌ (42) అక్రమ్‌ (32) మెరుపులతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఛేదనలో అక్రమ్‌ (3/49), ముస్తాక్‌ అహ్మద్‌ (3/41), అకిబ్‌ జావెద్‌ (2/27) ప్రతాపానికి నీల్‌ ఫెయిర్‌ బ్రదర్‌ (62) తప్ప మిగతా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై కప్‌నకు 22 పరుగుల దూరంలో ఆగిపోయింది.  

కివీస్‌కు ఆసీస్‌ కిక్‌...
ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్‌ది స్థిరమైన ప్రదర్శన. టోర్నీ ఎక్కడ జరిగినా కనీసం సెమీస్‌ చేరే స్థాయి ఉన్న జట్టుగా బరిలో దిగుతుంది. మొత్తం 12 కప్‌లలో 8 సార్లు సెమీస్‌కు రావడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి మార్టిన్‌ క్రో బ్యాటింగ్‌ మెరుపులతో సహ ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌లోనే కివీస్‌ హాట్‌ ఫేవరెట్‌గా కనిపించింది. కానీ, సెమీస్‌లో పాకిస్తాన్‌ విజృంభణకు తలొంచింది. మళ్లీ 2015లో సహ ఆతిథ్యంలో కెప్టెన్‌ మెకల్లమ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో మెగా టోర్నీలో విజేతగా నిలిచేలా కనిపించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నా... భీకర ఫామ్‌లో ఉన్న మెకల్లమ్‌ (0) డకౌట్‌ కావడంతో మానసికంగా బలహీన పడిపోయింది. ఇలియట్‌ (83), రాస్‌ టేలర్‌ (40) మాత్రమే రాణించడంతో 45 ఓవర్లలో 183కే ఆలౌటైంది. స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top