వీధి రౌడీలా కాదు హీరోలా...

Ben Stokes won the hearts of fans - Sakshi

అభిమానుల హృదయాలు గెలుచుకున్న స్టోక్స్‌  

లండన్‌: బెన్‌ స్టోక్స్‌ అంటే అందరికీ రెండే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి మ్యాచ్‌ను చేజార్చిన వైనం... ఆ తర్వాత నైట్‌ క్లబ్‌ వద్ద ఒక వ్యక్తిని చితక్కొట్టిన ఘటన... కానీ ఇప్పుడు అతను ఒకేసారి ఈ రెండింటినీ మరచిపోయే ఘనతను సాధించాడు. ‘వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్‌ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందుంటుంది’ అని మెగా టోర్నీకి ముందు చెప్పిన స్టోక్స్‌ చివరకు దానిని నిజం చేసి చూపించాడు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించి ఒకరకంగా అతను పాపపరిహారం చేసుకున్నాడు. టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన స్టోక్స్‌... ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ అపూర్వం. క్లిష్టపరిస్థితుల్లో అజేయంగా 84 పరుగులు చేసిన స్టోక్స్‌ చరిత్రలో నిలిచిపోయాడు. ‘నాకు మాటలు రావడం లేదు.

ఇక్కడికి చేరేందుకు గత నాలుగేళ్లుగా పడ్డ శ్రమ, ఇప్పుడు ప్రపంచ చాంపియన్లుగా నిలవడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఫైనల్‌ అనంతరం స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టి 12 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు వలస వెళ్లిన స్టోక్స్‌... ఇప్పుడు ఫైనల్లో కివీస్‌పైనే చెలరేగడం విశేషం. ‘న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే. అది గొప్ప జట్టు మాత్రమే కాదు. అందులో చాలా మంది మంచివాళ్లున్నారు. నా ఓవర్‌త్రో సిక్సర్‌ తర్వాత విలియమ్సన్‌కు నేను క్షమాపణ చెప్పా’ అని మ్యాచ్‌ అనంతరం స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. కష్టకాలంలో జట్టు సహచరులు తనకు, తన కుటుంబానికి అండగా నిలవడం వల్లే మళ్లీ కోలుకొని ఇక్కడి వరకు రాగలిగాలని 28 ఏళ్ల స్టోక్స్‌ భావోద్వేగంతో చెప్పాడు. ఇప్పుడెవరికీ అతని నాలుగు సిక్సర్లు గానీ బ్రిస్టల్‌లో గొడవ కానీ గుర్తుకు రావు. ఇంగ్లండ్‌ చరిత్రలో గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచిపోయిన ఇయాన్‌ బోథమ్‌ సహా మరెందరికో సాధ్యం కాని రీతిలో విశ్వ విజయంలో భాగమైన స్టోక్స్‌ ఇప్పుడు వారందరికీ సూపర్‌ హీరో మాత్రమే.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top