మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌పై మోదీ ఇలా..

PM Narendra Modi Responds To Mohammad Kaif Tweet - Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికిన సంగతి తెలిసిందే. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. దీనిలో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. దీనిలో భాగంగా‘జనతా కర్ఫ్యూ’కు అందరూ సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్పితే అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. (22న జనతా కర్ఫ్యూ)

దీనిపై ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌ స్పందించగా,  మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సైతం ట్వీట్‌ చేశాడు. ‘  కరోనా వైరస్‌పై ప్రధాని మోదీ చేసిన సూచన చాలా ముఖ్యమైనది. కరోనా నిరోధానికి జనతా కర్ఫ్యూతో దేశం యుద్ధాన్ని ప్రకటించిన క్రమంలో మోదీ సూచనను అంతా పాటించాలి’ అని కైఫ్‌ కోరాడు. దీనిపై మోదీ మరో ట్వీట్‌ చేశారు. ‘ మరో భాగస్వామ్యానికి సమయం వచ్చింది.  కరోనాపై పోరాటానికి భారత్‌ మొత్తం భాగస్వామ్యం కావాలి’ అని కైఫ్‌ ట్వీట్‌కు మోదీ రిప్లై ఇచ్చారు. దీనిలో భాగంగా 2002లో నాట్‌వెస్ట్‌ ఫైనల్‌లో భారత్‌ 326 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘ఆనాటి ఫైనల్‌ను ఎవరూ మర్చిపోలేరు. మహ్మద్‌ కైఫ్‌-యువరాజ్‌ సింగ్‌లు ఇద్దరూ అసాధారణమైన క్రికెటర్లు. నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారీ భాగస్వామ్యం సాధించిన విషయం ఎప్పటికీ చిరస్మరణీయమే’ అని మోదీ పేర్కొన్నారు. 

ఇంగ్లండ్‌తో జరిగిన ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 146 పరుగులకే ఐదు  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో యువరాజ్‌-కైఫ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. యువరాజ్‌ సింగ్‌ 69 పరుగులు చేసి ఔటవ్వగా, కైఫ్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. టెయిలెండర్ల సాయంతో  మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఆ మ్యాచ్‌లో విజయం తర్వాత అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ  తన చొక్కా విప్పేసి మరీ సంబరాలు చేసుకోవడం క్రికెట్‌ అభిమానులకు బాగా సుపరిచితం. (‘కరోనాపై పోరాటం టెస్టు క్రికెట్‌లాంటిది’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top