కివీస్‌ జోరుకు బ్రేక్‌ పడేనా?

New Zealand Win Toss Opt To Field Against South Africa - Sakshi

బర్మింగ్‌హామ్‌: భారత్‌తో రద్దయిన మ్యాచ్‌ మినహా... ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు తమ కంటే తక్కువ స్థాయి జట్లతో ఆడుతూ వచ్చిన న్యూజిలాండ్‌ బుధవారం పెద్ద జట్టయిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మరో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కివీస్‌ ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గాయం నుంచి కోలుకున్న సఫారీ పేసర్‌ ఎన్‌గిడి తిరిగి జట్టులోకి చేరాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉందని అంపైర్లు టాస్‌ ఆలస్యంగా వేశారు. దీంతో గంటకిపైగా ఆటకు తుడిచిపెట్టుకపోవడంతో మ్యాచ్‌ను 49ఓవర్లకు కుదించారు.  

అయితే ప్రస్తుత ఫామ్‌ ప్రకారం కివీస్‌దే పైచేయి కావొచ్చు. కానీ, సఫారీలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నారు. పేసర్‌ ఎన్‌గిడి గాయం నుంచి కోలుకుని అందుబాటులోకి రావడం జట్టుకు ఊరటనిస్తోంది. దీంతోపాటు గత ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తమను ఓడించిన న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వారి ముందుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం కానుంది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ విలియమ్సన్, రాస్‌ టేలర్‌కు తోడుగా ఓపెనర్లు గప్టిల్, మున్రో రాణించాలని కివీస్‌ ఆశిస్తోంది. వెటరన్‌ ఆమ్లా టచ్‌లోకి రావడం సఫారీలకు బలం. డికాక్, కెప్టెన్‌ డు ప్లెసిస్‌ పరుగులు సాధిస్తున్నా, డసెన్, మిల్లర్‌ సైతం ఓ చేయి వేస్తేనే విజయంపై నమ్మకం పెట్టుకోవచ్చు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ విజృంభిస్తే కివీస్‌కు ఈ కప్‌లో తొలి పరాజయం రుచి చూపించవచ్చు.

తుదిజట్లు:
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌(కెప్టెన్‌), గప్టిల్‌, మున్రో, టేలర్‌, లాథమ్‌, నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, సాంట్నర్‌, హెన్రీ, ఫెర్గుసన్‌, బౌల్ట్‌
దక్షిణాఫ్రికా: డుప్లెసిస్‌(కెప్టెన్‌), ఆమ్లా, డికాక్‌, మక్రాం, డసన్‌, ఫెహ్లుకోవియా, మిల్లర్‌, మోరిస్‌, రబడా, ఎన్‌గిడి, తాహీర్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top