
ఓపెనర్ సీఫ్రెట్ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చూపించగా..
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌కు 220 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. కివీస్ ఓపెనర్ సీఫ్రెట్ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చూపించగా.. కొలిన్ మున్రో(34: 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3 సిక్సర్లు) భారత బౌలర్లను ఆడుకున్నారు. చివర్లో స్కాట్ కుగ్లీన్ 7 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు సీఫ్రెట్, మున్రోలు మంచి శుభారంభాన్ని అందించారు. దాటిగా ఆడుతూ భారత బౌలర్లను చీల్చిచెండాడారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఈ క్రమంలో 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ సెంచరీ సాధించగా.. దాటిగా ఆడే క్రమంలో కృనాల్ బౌలింగ్‌లో మున్రో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 86 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌తో సీఫ్రెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ దశలో ఖలీల్ అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్‌గా సీఫ్రెట్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కివీస్ బ్యాట్స్‌మెన్ దాటిగా ఆడే ప్రయత్నం చేశారు. ఓ వైపు వికెట్ల పడుతున్నా స్కోర్ బోర్డ్ వేగాన్ని మాత్రం తగ్గించలేదు. దీంతో కీవీస్ భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక దినేశ్ కార్తీక్ అద్బుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యాకు రెండు, కృనాల్, భువనేశ్వర్, ఖలీల్, చహల్‌లు తలో వికెట్ తీశారు.