చరిత్ర సృష్టించిన మహేంద్రసింగ్‌ ధోనీ | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మహేంద్రసింగ్‌ ధోనీ

Published Thu, Jun 6 2019 3:27 PM

MS Dhoni creates history - Sakshi

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ రెండు సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. .. ఓపెనర్‌  రోహిత్ శర్మ, భారత బౌలర్లు బుమ్రా, చాహల్‌ మెరుపులు మెరిపించిన ఈ మ్యాచ్‌లో ధోనీ కూడా తనదైన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌ ద్వారా 600 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ ఆడిన తొలి వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డు నెలకొల్పాడు. 

మొదట జస్ప్రీత్ బమ్రా (2/35), యజువేంద్ర చహల్ (4/51) తమ బౌలింగ్‌తో సఫారీలను 227 పరుగులకే కట్టడి చేయడం.. అనంతరం రోహిత్ శర్మ అజేయంగా అద్భుత సెంచరీ (122) సాధించడంతో భారత్‌ దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో గెలిచి.. ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా టైటిల్‌ వేటను విజయంతో ఆరంభించిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని తనదైన రికార్డులు సాధించాడు. అత్యధికంగా 600 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ ఆడిన వికెట్‌ కీపర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. 

అత్యధిక అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ ఆడిన వికెట్‌ కీపర్స్ జాబితా ఇది..

  • ఎంఎస్‌ ధోనీ          : 600 *
  • ఎం బౌచర్            : 596
  • కుమార సంగక్కర   : 499
  • అడం గిల్‌క్రిస్ట్‌         : 485

దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టంపింగ్స్‌తోనూ ధోనీ మరో రికార్డు సాధించాడు. ప్రమాదకరంగా మారుతున్న సాఫారీ బ్యాట్స్‌మన్‌ ఫెలుక్వాయోను చాహల్ బౌలింగ్‌లో స్టంపౌట్‌ చేసి.. ధోనీ పెవిలియన్‌ పంపించాడు. తద్వారా అత్యధికంగా 139 స్టంపౌట్‌ వికెట్లు సాధించిన కీపర్‌గా.. పాకిస్థాన్ ఆటగాడు 
మొయిన్ ఖాన్ రికార్డును సమం చేశాడు. ఇక వరల్డ్‌ కప్‌లో అత్యధికంగా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిన వికెట్‌ కీపర్ల జాబితాలో ధోనీ మూడు స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ప్రపంచ్‌కప్‌లో ధోనీ 33 మందిని ఔట్‌ చేశాడు. ఈ జాబితాలో 54 వికెట్లతో కుమార సంగర్కర మొదటి స్థానంలో ఉండగా.. 52 వికెట్లతో అడం గిల్‌క్రిస్ట్‌ రెండో స్థానంలో, 32 వికెట్లతో మెక్కలమ్‌ నాలుగోస్థానంలో, 31 వికెట్లతో ఎం బౌచర్‌ ఐదో స్థానంలో ఉన్నారు. 

అంతేకాదు ఈ మ్యాచ్‌లో ధోని 34 పరుగులు చేసి రాణించాడు. మ్యాచ్‌ ముగింపు దశలో రోహిత్‌ శర్మకు చక్కని సహకారం అందించి.. ఇదరు కలిసి.. 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా అలవోకగా టీమిండియా విజయ లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement
Advertisement