ఏడో భారత క్రికెటర్ ధోని!

MS Dhoni 7th Indian to hit 750 fours in ODI cricket

పుణె:న్యూజిలాండ్ ఇక్కడ బుధవారం జరిగిన రెండో వన్డే ద్వారా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని రెండు అరుదైన ఘనతల్ని సాధించాడు. తొలుత ఫీల్డింగ్ విభాగంలో సొంత గడ్డపై అత్యధిక క్యాచ్ లు పట్టిన తొలి భారత వికెట్ కీపర్ గా గుర్తింపు తెచ్చుకున్న ధోని.. బ్యాటింగ్ లో సైతం ఒక మైలురాయిని సాధించాడు.

ఆ మ్యాచ్ లో మూడు ఫోర్లు కొట్టిన ధోని తన ఖాతాలో 752వ వన్డే ఫోర్ ను జమ చేసుకున్నాడు. తద్వారా భారత్ తరపున 750, అంతకంటే ఎక్కువ ఫోర్లు సాధించిన ఏడో క్రికెటర్ గా ధోని నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్(2,016), సెహ్వాగ్‌ (1,132), గంగూలీ (1,122), ద్రవిడ్‌ (950), యువరాజ్‌ సింగ్‌ (908), కోహ్లీ (830)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఆ మ్యాచ్ లో సొంత గడ్డపై 200వ అంతర్జాతీయ క్యాచ్ ను ధోని అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో స్వదేశంలో అత్యధిక క్యాచ్ లు పట్టిన తొలి భారత వికెట్ కీపర్ గా ధోని గుర్తింపు సాధించాడు. ధోని కంటే ముందు కుమార సంగక్కరా(శ్రీలంక), అలెక్ స్టివార్ట్(ఇంగ్లండ్)లు తమ గడ్డపై రెండొందల క్యాచ్ లను పట్టిన వికెట్ కీపర్లు. ఆ తరువాత స్థానంలో ధోని ఉన్నాడు.ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్ లు పట్టిన జాబితాలో ధోనీ నాల్గో స్థానంలో ఉన్నాడు.  ప్రస్తుతం ధోని 288 వన్డే క్యాచ్ ల పట్టి నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌(ఆసీస్-417), మార్క్‌ బౌచర్‌ (దక్షిణాఫ్రికా-402), సంగక్కర(శ్రీలంక-383) మాత్రమే ధోనీ కంటే ముందు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top