‘ధోని’ నాట్‌ జస్ట్‌ ఏ నేమ్‌!  | MS Dhoni 38th Birthday Special Story | Sakshi
Sakshi News home page

‘ధోని’ నాట్‌ జస్ట్‌ ఏ నేమ్‌! 

Jul 7 2019 10:22 AM | Updated on Jul 7 2019 8:01 PM

MS Dhoni 38th Birthday Special Story - Sakshi

అరేంగేట్ర మ్యాచ్‌లోని గోల్డెన్‌ డకౌట్‌ అంటూ హోరెత్తిన కామెంటేటర్స్‌..

మారుమూల చిన్న పట్టణం.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. కావల్సినంత ప్రతిభ.. అవకాశాలు పరిమితం.. కష్టాలు అపరిమితం.. కుటుంబ బాధ్యతలు.. తండ్రి పడుతున్న కష్టాలు.. క్రికెట్‌ కెరీర్‌ కొనసాగించాలా.. ఉద్యోగంలో కొనసాగాలా.. ఇలాంటి పరిస్థితి నుంచి భారతీయ క్రికెట్‌లో తారజువ్వలా దూసుకొచ్చిన ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని.

టీ20 ప్రపంచకప్‌.. వన్డేప్రపంచకప్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ..అన్ని ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. విజయాన్ని అందరి ఖాతాలో వేసి.. అపజయాన్ని తన ఖాతాలో వేసుకునే గొప్ప దార్శనికుడు. భారత క్రికెట్‌ గతిని మార్చి.. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన డైనమైట్‌. అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందిస్తున్న మహేంద్రుడు నేటితో 38వ ఏట అడుగెడుతున్న సందర్భంగా  ప్రత్యేక​ కథనం.!

తెల్లప్యాడ్‌లు.. జులపాల జుట్టు..
2004 డిసెంబర్‌ 23.. వన్డేసిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 180 పరుగులకు ఐదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం అప్పటివరకు చూడని, తెలియని ఆటగాడు.. విభిన్నంగా తెల్లప్యాడ్‌లు.. జులపాల జుట్టుతో మైదానంలోకి అడుగుపెట్టాడు. వచ్చిరాగానే బంతిని స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడి సింగిల్‌ తీయాలనే ప్రయత్నం. కానీ నాన్‌స్ట్రైకర్‌ సమన్వయం లోపంతో రనౌట్‌. అంతే అరేంగేట్ర మ్యాచ్‌లోని గోల్డెన్‌ డకౌట్‌ అంటూ హోరెత్తిన కామెంటేటర్స్‌. ‘వీడు కూడా ఎక్కువ రోజులండడూ..’ టీవీ ముందున్న ప్రేక్షకుల నోట నిరాశతో వచ్చిన మాట. తరువాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 23 పరుగులే.

 



ధోని దండయాత్ర..
కట్‌ చేస్తే పాకిస్తాన్‌ సిరీస్‌.. వైజాగ్‌ వేదికగా రెండో వన్డే. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 26 పరుగులకే ఓపెనర్‌ సచిన్‌ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం అనూహ్యంగా జులపాల ఆటగాడు..( అప్పటి వరకు పెద్దగా తెలియని పేరు). అవే తెల్లప్యాడ్‌లతో క్రీజులోకి వచ్చాడు. అందరూ షాక్‌. మరో ఎండ్‌లో సెహ్వాగ్‌ ఆడుతున్నాడనే భరోసా. కానీ జులాపాల ఆటగాడు జూలు విధిల్చాడు. అప్పటి వరకు కనివిని ఎరుగని హెలికాప్టర్‌ షాట్స్‌తో పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 పరుగులు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ జులపాల ఆటగాడు ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టింది. ఎంఎస్‌ ధోని అని తెలుసుకుంది. కాదు మదిలో దాచుకుంది. అప్పుడు అలా మొదలైన ధోని దండయాత్ర.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలోనే టీ20 ప్రపంచకప్‌.. 2011 ప్రపంచకప్‌, చాంపియన్‌ ట్రోఫీ, వన్డే,టెస్టుల్లో నెం1 ఇలా అన్ని ధోని కెప్టెన్సీ ముందు క్యూ కట్టాయి. సారథ్య బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకున్నా.. యువ ఆటగాళ్లకు అండగా ఉంటూ.. పెదన్నలా వ్యవహిరిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్‌ కోహ్లి.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ అయినా.. క్లిష్ట పరిస్థితిల్లో కెప్టెన్సీ వహించేది, వ్యూహాలు రచించేది మాత్రం ధోనినే. బౌలర్లతో కలిసి ధోని స్కెచ్‌ వేస్తే ఎంతటి ఆటగాడైనా అతని ఉచ్చులో చిక్కుకోవాల్సిందే.

సాటిలేని వికెట్‌ కీపర్‌..
వికెట్ల వెనుకాలా చురుకుగా కదులుతూ.. కళ్లు చెదిరే స్టంపింగ్స్‌.. రనౌట్‌లు, ఔరా అనిపించే అద్భుత క్యాచ్‌లతో ధోని జట్టుకు ఎన్నో విజయాలందించాడు. మరెన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. 90 టెస్టులాడిన ధోని కీపర్‌గా 256 అవుట్లలో పాలుపంచుకొని ఈ ఫార్మట్‌లో ఐదో కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఇందులో 256 క్యాచ్‌లు ఉండగా 38 స్టంప్‌ ఔట్‌లున్నాయి.  ఇక వన్డేల్లోనైతే ఏకంగా 443 ఔట్లలో 344 క్యాచ్‌లతో 123 స్టంపింగ్స్‌ ఉండటం విశేషం. దీంతో అత్యధిక స్టంప్‌ అవుట్‌లు చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ల్లో 57 క్యాచ్‌లు 34 స్టంపింగ్‌లతో 91 ఔట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ధోని పరుగులు..
90 టెస్టుల్లో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 4,876 పరుగులు చేశాడు. అత్యధిక​ స్కోర్‌ 224
349 వన్డేల్లో 10 సెంచరీలు,72 హాఫ్‌ సెంచరీలతో 10,723 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 183
98 టీ20ల్లో 2 హాఫ్‌ సెంచరీలతో 1617 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్‌ 56
190 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 23 హాఫ్‌ సెంచరీలతో 4432 పరుగులు నమోదు చేశాడు. అత్యధిక స్కోర్‌ 84
-శివ ఉప్పల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement