‘రెండేళ్లు సరిపోదు.. అంతకుమించి నిషేధం విధించాల్సింది’

Michael Vaughan Wrote on Twitter No Sympathy for Shakib - Sakshi

హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, టెస్టు, టీ20 సారథి షకీబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. షకీబుల్‌ నిషేధం ఒక్కసారి ప్రపంచ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపేసింది. ప్రపంచ ఆగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ ఇలా నిషేధానికి గురవ్వడంతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నివ్వెర పోయింది. అయితే ఈ ఘటనపై తాజా, మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా షకీబుల్‌ నిషేధంపై ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘షకీబుల్‌పై ఎలాంటి సానుభూతి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. దీంతోనైనా యువ క్రికెటర్లకు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుస్తుంది. అంతేకాకుండా నిబంధనలు పాటించకపోతే ఎలాంటి గతి పడుతుందో షకీబుల్‌ను చూసి బుద్ది తెచ్చుకుంటారు. ఇక షకీబుల్‌పై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు.. నిషేధం ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది’అంటూ వాన్‌ పేర్కొన్నాడు. 

ఇక ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ సందర్భంగా బుకీలు సంప్రదించిన సమాచారాన్ని చెప్పకపోవడంతోనే షకీబుల్‌పై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అయితే విచారణలో పొరపాటు ఒపుకోవడంతో నిషేధాన్ని ఏడాదాకి పరిమితం చేసింది. అంతేకాకుండా ఈ నిషేధ సమయంలో ఐసీసీ అవినితీ నిరోధక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఇక ఈ 32 ఏళ్ల స్టార్‌ ఆల్‌రౌండర్‌పై నిషేధం అతడి కెరీర్‌కు, బంగ్లా క్రికెట్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిషేధంతో టీమిండియాతో సిరీస్‌కు ముఖ్యంగా ఐపీఎల్‌, ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌కు షకీబుల్‌ దూరం కానున్నాడు. ఇక షకీబుల్‌ లేకుండా బంగ్లాదేశ్‌ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top