మెదక్‌ మావెరిక్స్‌ వర్సెస్‌ ఆదిలాబాద్‌ టైగర్స్‌ | Sakshi
Sakshi News home page

మెదక్‌ మావెరిక్స్‌ వర్సెస్‌ ఆదిలాబాద్‌ టైగర్స్‌

Published Sun, Feb 25 2018 10:13 AM

medal vs adilabad in title fight in ttl - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 లీగ్‌లో మెదక్‌ మావెరిక్స్, ఆదిలాబాద్‌ టైగర్స్‌ జట్లు టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్, రంగారెడ్డి రైజర్స్‌ జట్లు పరాజయం పాలయ్యాయి. నేడు జింఖానా మైదానంలో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు మూడో స్థానం కోసం... రాజీవ్‌గాంధీ స్టేడియంలో మెదక్, ఆదిలాబాద్‌ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. శనివారం ఉప్పల్‌ మైదానంలో జరిగిన తొలి సెమీస్‌లో మెదక్‌ మావెరిక్స్‌ జట్టు 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ శ్రీనిధియాన్‌ థండర్‌బోల్ట్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు సాధించింది. చైతన్య (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), చందన్‌ సహాని (31; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రణీత్, చైతన్య కృష్ణ, మిఖిల్‌ జైస్వాల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం అభిరత్‌ రెడ్డి (54 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్‌ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జె. మల్లికార్జున్‌ (25 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించాడు. అభిరత్‌ రెడ్డికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారం దక్కింది. రెండో సెమీస్‌లో ఆదిలాబాద్‌ టైగర్స్‌ 16 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌పై విజయం సాధించింది. మొదట హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. మీర్‌ జావిద్‌ అలీ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), నీరజ్‌ బిస్త్‌ (40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హిమతేజ (40; 6 ఫోర్లు) దూకుడు ప్రదర్శిం చారు. అనంతరం రంగారెడ్డి రైజర్స్‌ జట్టు 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. అక్షత్‌ రెడ్డి (39 బంతుల్లో 81; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌ వృథా అయింది. ఆదిలాబాద్‌ బౌలర్లలో రాకేశ్, కరణ్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. మీర్‌ జావిద్‌ అలీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

Advertisement
Advertisement