
లక్ష్మణ్ సలహాలు ఉత్తేజాన్నిచ్చాయి
మాజీ టెస్టు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన విలువైన సలహాలతో జింబాబ్వే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నట్టు క్రికెటర్ మనోజ్ తివారీ చెప్పాడు.
క్రికెటర్ మనోజ్ తివారీ
న్యూఢిల్లీ: మాజీ టెస్టు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన విలువైన సలహాలతో జింబాబ్వే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నట్టు క్రికెటర్ మనోజ్ తివారీ చెప్పాడు. అయితే దీని కోసం ఎలాంటి ప్రణాళికలు పెట్టుకోదలుచుకోలేదని స్పష్టం చేశాడు. ‘ఇటీవలి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) విజన్ 2020 శిబిరంలో లక్ష్మణ్‌తో చాలా సమయం గడిపాను. ఈ సందర్భంగా మాకు అమూల్యమైన బ్యాటింగ్ మెళకువలను చెప్పాడు. ఇక నా వరకైతే వర్తమానంపైనే దృష్టి పెడుతూ ముందుకెళ్లాలని సలహా ఇచ్చాడు. నా కెరీర్‌ను అతడు చాలా దగ్గరగా చూశాడు. ‘చాలాసార్లు గాయాలపాలై జట్టులోకి కమ్‌బ్యాక్ కావడం అంత సులువు కాదు. ఇప్పటికే చాలా కఠినంగా శ్రమించావు.
ఇక ఇప్పుడు చేయాల్సిందల్లా నెగెటివ్ ఆలోచనలను దగ్గరికి రానీయకు. ప్రస్తుతం ఉత్తమ క్రికెటర్‌గా మారేందుకు ఏం చేయాలో దృష్టి సారించు’ అని లక్ష్మణ్ సూచించాడు. ఈ మాటలు నాకు ఎంతగానో ఉత్తేజాన్నిచ్చాయి’ అని 29 ఏళ్ల తివారి తెలిపాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేది తెలీదు కాబట్టి జింబాబ్వే పర్యటనకు ఎలాంటి అంచనాలు లేకుండా వెళుతున్నానని చెప్పాడు. వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకుండా జట్టులో శాశ్వత చోటు కోసం ప్రయత్నిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.