ఆ లోటు... ఆల్‌ రౌండర్‌! 

Main reasons for Indian defeat - Sakshi

ఒకరిద్దరిపైనే భారం

సమష్టిగా రాణించని వైనం 

భారత ఓటమికి ప్రధాన కారణాలు

బ్యాటింగ్‌లో కొంతలో కొంతైనా తమవంతు పాత్ర పోషించని లోయరార్డర్‌! కీలక సమయంలో ప్రభావం చూపలేకపోయిన స్పిన్నర్‌! ఏమాత్రం ఉపయోగపడని ఆల్‌రౌండర్‌! నాలుగో టెస్టులో భారత్‌ పరాజయానికి... సిరీస్‌ కోల్పోవడానికి ఈ మూడే మూల కారణాలు. సరిగ్గా... ఇవే అంశాల్లో రాణించిన ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై పట్టు బిగించి   సిరీస్‌ను కైవసం    చేసుకుంది.   

సాక్షి క్రీడా విభాగం  : ఇరు జట్ల ఓపెనర్లు విఫలమయ్యారు. మిడిలార్డరూ గొప్పగా మెరిసిందేమీ లేదు. పేసర్ల ప్రతాపమూ అంతంతే! ఈ నేపథ్యంలో సౌతాంప్టన్‌ టెస్టును కేవలం ‘ఇంగ్లండ్‌ లోయరార్డర్‌ గెలుపు’గా వర్ణించవచ్చు. మ్యాచ్‌ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అవసరమైన సందర్భంలో చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ ఆతిథ్య జట్టుకు కొండంత అండగా నిలవగా, ఇదే ప్రదర్శన టీమిండియా తరఫున కరవైంది. దీనిని బట్టి సంప్రదాయ క్రికెట్‌లో 6, 7, 8 స్థానాల్లో బ్యాట్‌తో ఓ చేయి వేయగల బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉండటం ఎంతటి ఉపయోగకరమో అర్థమవుతోంది. ఆ స్థానాల్లో స్యామ్‌ కరన్, మొయిన్‌ అలీ రూపంలో నిఖార్సైన ఆటగాళ్లుండటం ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. అడపాదడపా రాణించే హార్దిక్‌ పాండ్యాను నమ్ముకుంటున్న భారత్‌ను అతడి వైఫల్యం వెనుకంజ వేసేలా చేయగా... ఇటీవలి కాలంలో మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తున్న భువనేశ్వర్‌ దూరమవడం ఎంతటి ఇబ్బందికరమో తెలిసొచ్చింది. 

తేడా వారిద్దరే... 
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో ఇంగ్లండ్‌ స్కోరు 86/6. స్టోక్స్‌ సహా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా ఔటయ్యారు. కానీ, మొయిన్‌ అలీ, కరన్‌ ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించి జట్టును ఒడ్డున పడేశారు. ఆ తర్వాత కరన్‌ పట్టువిడవకుండా ఆడి స్కోరును 200 దాటించాడు. చివరి నాలుగు వికెట్లకు 160 పరుగులు జమయితే, ఇందులో దాదాపు సగం అతడివే. ఇక భారత్‌ ఇన్నింగ్స్‌లో 6 నుంచి 9 స్థానాల్లో దిగిన బ్యాట్స్‌మెన్‌ చేసినవి ఐదంటే ఐదే పరుగులు. పుజారాకు ఇషాంత్‌ తోడు నిలిచాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే 200 దాటడమైనా కష్టమయ్యేది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ దాదాపు ఇదే కథ. ఈసారి బట్లర్, స్టోక్స్, కరన్‌ దెబ్బకొట్టారు. 6, 7 వికెట్లకు ఈ ముగ్గురు 111 పరుగులు జోడించారు. ఇదే స్థానాల్లో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో జతయినవి 27 పరుగులే కావడం గమనార్హం. మొత్తమ్మీద ఈ టెస్టులో ఇరు జట్ల మధ్య తేడా చూపుతూ కరన్‌ (124 పరుగులు/2 వికెట్లు), అలీ (49 పరుగులు/9 వికెట్లు) కోహ్లి సేన పాలిట విలన్లయ్యారు. 

అశ్విన్‌కు ఏమైంది? 
ఓవైపు మొయిన్‌ అలీ తన ఆఫ్‌ స్పిన్‌తో మొదటి ఇన్నింగ్స్‌లో భారత లోయరార్డర్‌ను కుప్పకూల్చి, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి, రహానేల ఆటకట్టించి జట్టుకు గెలుపు బాట వేస్తే... అతడికంటే మెరుగైన స్పిన్నర్‌ అయిన అశ్విన్‌ పూర్తిగా తేలిపోయాడు. మూడో రోజు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లు వేసినా అతడు తీసింది ఒక్కటే వికెట్‌. పిచ్‌ ఏమాత్రం అనుకూలించినా బ్యాట్స్‌మెన్‌ను చుట్టేస్తాడని తనకున్న పేరుకు సౌతాంప్టన్‌లో అశ్విన్‌ న్యాయం చేయలేకపోయాడు. దీన్నిబట్టి మూడో టెస్టు సందర్భంగా అయిన తుంటి గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకున్నా ఆడిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు మూడో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా గెలుపులో కీలకంగా నిలిచిన హార్దిక్‌ పాండ్యా... నాలుగో టెస్టులో ఒక్క వికెట్‌ మాత్రమే తీసి, ఐదు పరుగులే చేసి రెండు విభాగాల్లోనూ తీవ్రంగా నిరాశపర్చాడు. పాండ్యా తనవంతుగా రాణించి ఉంటే జట్టు మరింత పోటీ అయినా ఇచ్చేది. బౌలింగ్‌లో లోటు తెలియకున్నా, బ్యాటింగ్‌లో 8వ స్థానంలో భువనేశ్వర్‌ లేకపోవడం కోహ్లి సేనకు ప్రతికూలంగా మారింది. దక్షిణాఫ్రికా పర్యటనలో జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులో భువీ ఆడిన ఇన్నింగ్స్‌ (30, 33)లను ఓసారి గుర్తుచేసుకుంటే అతడి అవసరం జట్టుకు ఎంతగా ఉందో తెలుస్తుంది. 

వారింతే(నా)... 
నాటింగ్‌హామ్‌లో అర్ధ శతక భాగస్వామ్యాలతో ఫర్వాలేదనిపించిన ఓపెనర్లు ధావన్, రాహుల్‌ సౌతాంప్టన్‌లో మళ్లీ పాత ఫామ్‌లోకి వెళ్లిపోయారు. వీరి నుంచి ఏమాత్రం పరుగులు ఆశించలేని పరిస్థితి. తొలి ఇన్నింగ్స్‌లో మోస్తరు స్కోర్లతో కొంతసేపు నిలిచినా, ఛేదనలో చేతులెత్తేశారు. సిరీస్‌ చివరకు వచ్చింది, విజయ్‌ ఎలాగూ జట్టుతో లేడు కాబట్టి ఇద్దరిలో ఎవరిని తప్పించి ఎవరిని ఆడించినా వచ్చేది, పోయేదేమీ లేదు. ఈ నేపథ్యంలో యువ సంచలనం పృథ్వీ షాను పరీక్షించి చూద్దామని కోహ్లి భావించినా భావించొచ్చు. చివరి టెస్టు నాటికి ఏమైనా జరుగొచ్చు. 

కొసమెరుపు: తన కెప్టెన్సీలో 38 టెస్టుల తర్వాత గత మ్యాచ్‌ తుది జట్టుతోనే బరిలో దిగిన కోహ్లికి అదేమంత ఫలితం ఇవ్వలేదు. ప్రభావమూ చూపలేదు. ఇదే సమయంలో రెండు మార్పులు (కరన్, మొయిన్‌ అలీలకు చోటివ్వడం) చేసిన ఇంగ్లండ్‌కు అవి విశేషంగా కలిసొచ్చాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top