ఆరేళ్ల తర్వాత... అదే తేదీన | Lewis Hamilton storms from sixth to win the British Grand Prix as Mercedes team-mate Nico Rosberg fails to finish | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల తర్వాత... అదే తేదీన

Jul 7 2014 12:55 AM | Updated on Sep 2 2017 9:54 AM

ఆరేళ్ల తర్వాత... అదే తేదీన

ఆరేళ్ల తర్వాత... అదే తేదీన

సొంతగడ్డపై లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జూలై 6న తొలిసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన ఈ బ్రిటన్ డ్రైవర్...

బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
 సీజన్‌లో ఐదో విజయం
 
 సిల్వర్‌స్టోన్: సొంతగడ్డపై లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జూలై 6న తొలిసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన ఈ బ్రిటన్ డ్రైవర్... అదే ఫలితాన్ని, అదే తేదీన 2014లో పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి 52 ల్యాప్‌లను 2 గంటల 26 నిమిషాల 52.094 సెకన్లలో పూర్తి చేశాడు.

ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ 29వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ దూసుకుపోయాడు. చివరికి 30 సెకన్ల తేడాతో విజయాన్ని దక్కించుకొని సీజన్‌లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 28 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు.
 
 అయితే హఠాత్తుగా అతని గేర్‌బాక్స్‌లో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ 28వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. రేసు ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే ఫెలిప్ మసా (విలియమ్స్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) నియంత్రణ కోల్పోయి ట్రాక్‌పై పరస్పరం ఢీకొట్టుకోవడంతో గంటపాటు రేసును నిలిపివేశారు. రేసు పునః ప్రారంభమయ్యాక హామిల్టన్, రోస్‌బర్గ్ హోరాహోరీగా పోటీపడినా తుదకు హామిల్టన్ పైచేయి సాధించాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement