ఆనంద్ అద్భుతం చేస్తాడా? | indian grand master viswanathan anandah is under pressure | Sakshi
Sakshi News home page

ఆనంద్ అద్భుతం చేస్తాడా?

Nov 18 2013 2:50 AM | Updated on Sep 2 2017 12:42 AM

ఆనంద్ అద్భుతం చేస్తాడా?

ఆనంద్ అద్భుతం చేస్తాడా?

సొంతగడ్డపై పరాభవం తప్పించుకోవాలంటే భారత గ్రాండ్‌మాస్టర్, డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించాల్సిన సమయం ఆసన్నమైంది.

చెన్నై: సొంతగడ్డపై పరాభవం తప్పించుకోవాలంటే భారత గ్రాండ్‌మాస్టర్, డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీలో ప్రస్తుతం ఆనంద్ 2-4 పాయింట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం జరిగే ఏడో గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో పోటీపడనున్నాడు. ఐదో గేమ్‌లో నల్ల పావులతో, ఆరో గేమ్‌లో తెల్ల పావులతో ఓటమి చవిచూసిన ఆనంద్ టైటిల్ రేసులో నిలవాలంటే తదుపరి గేముల్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. మరో ఆరు గేమ్‌లు మిగిలి ఉన్న ఈ పోటీలో కార్ల్‌సెన్ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి తొలిసారి విశ్వవిజేత అయ్యేందుకు పటిష్ట పునాదిని నిర్మించుకున్నాడు.
 
  పోటీ ఆరంభం ముందే చెస్ పండితులు 22 ఏళ్ల కార్ల్‌సెన్‌ను ఫేవరెట్‌గా పరిగణించారు. అయితే 43 ఏళ్ల ఆనంద్ ఇంత తొందరగా కార్ల్‌సెన్ వ్యూహంలో పడిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న తీరు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిగ్రహంతో ఉండే ఆనంద్ శనివారం ఆరో గేమ్ పూర్తయ్యాక నిర్వహించిన మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశాడు. ‘ఈ పరాజయం పెద్ద దెబ్బ. దీనిని ఊహించలేదు. అయినా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాను’ అని నార్వే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ సమాధానం ఇచ్చాడు.  ఈ సమాధానాన్ని లోతుగా విశ్లేషించాలని ఆ జర్నలిస్ట్ కోరగా... ఆనంద్ సహనం కోల్పోయాడు.
 
  ‘అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానంటే దాని అర్థం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానంతే. మీరు ఇంగ్లిష్‌ను ఎందుకు అర్థం చేసుకోరో నాకు తెలియడంలేదు’ అని ఆనంద్ ఆగ్రహంతో జవాబు ఇచ్చాడు. రెండు పాయింట్లతో వెనుకంజలో ఉన్నా ఆనంద్ అవకాశాలను పూర్తిగా తీసిపారేయలేం. ఈ ఆరు గేముల్లో ఆనంద్‌కు మూడుసార్లు తెల్ల పావులతో ఆడే అవకాశం లభిస్తుంది. సోమవారం జరిగే ఏడో గేమ్‌లో ఆనంద్ గెలిస్తే ఏదైనా జరగొచ్చు. అయితే కార్ల్‌సెన్ ఆటతీరుపై అవగాహన ఉన్నవారు మాత్రం ఆనంద్ కోలుకోవడం కష్టమేనని అంటున్నారు.  గేమ్‌ను సుదీర్ఘంగా సాగదీయడం... ప్రత్యర్థి అలసిపోయేలా చేయడం... ఆ తర్వాత అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థులే పొరపాట్లు చేసే విధంగా పరిస్థితులు సృష్టించడం.. దాని ద్వారా గేమ్‌ను శాసించేస్థితిలోకి తెచ్చుకోవడం కార్ల్‌సెన్ శైలి. ఆనంద్‌పై ఇవే పద్ధతులను ప్రయోగించి గత రెండు గేముల్లో కార్ల్‌సెన్ సత్ఫలితాలు సాధించాడు. ఇకనైనా ఆనంద్ తేరుకొని కొత్త వ్యూహా లతో ప్రత్యర్థికి చెక్ పెడతాడో లేక చేతులెత్తేస్తాడో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement