బీసీసీఐకి రూ.14 కోట్లు చెల్లించండి

ICC orders PCB to pay 60 per cent of cost claimed by BCCI - Sakshi

 పీసీబీకి ఐసీసీ ఆదేశం

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వివాదాల పరిష్కార కమిటీ (డీఆర్‌సీ) మళ్లీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కే అనుకూలంగా తీర్పునిచ్చింది. నష్ట పరిహారం కోసం బీసీసీఐని పదేపదే ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) న్యాయపరమైన ఖర్చుల కోసం రూ. 14 కోట్లు  బీసీసీఐకి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనందువల్ల తమకు నష్టం వాటిల్లిందని, పరిహారంగా రూ. 447 కోట్లు బీసీసీఐ నుంచి ఇప్పించాలని పాకిస్తాన్‌ ఐసీసీతో వాదిస్తూ వచ్చింది. దీన్ని డీఆర్‌సీ ఇటీవల కొట్టివేసింది. ఎంఓయూ అనేది ఒక ఒప్పందం మాత్రమేనని కానీ దాని ప్రకారం అంతా నడుచుకోవాలని ఏమీ లేదని పీసీబీకి స్పష్టం చేసింది.

అయితే తమను ఇబ్బంది పెట్టిన పీసీబీ నుంచి న్యాయపరమైన ఖర్చులు రాబట్టుకునే అవకాశం ఉండటంతో డీఆర్‌సీని బీసీసీఐ ఆశ్రయించింది. బుధవారం బీసీసీఐ పిటీషన్‌ను విచారించిన డీఆర్‌సీ లీగల్‌ ఖర్చులు, పరిపాలన, ఇతరత్రా పరిహారం ఖర్చులు కలుపుకొని 60 శాతం భారత బోర్డుకు చెల్లించాలని పీసీబీని ఆదేశించింది. 60 శాతమంటే 20 లక్షల అమెరికా  డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ. 14 కోట్లు. ఇప్పుడు ఈ మొత్తం పాకిస్తాన్‌కు గుదిబండగా మారే అవకాశముంది. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీకి ఇది తలకుమించిన భారమే. దీంతో బీసీసీఐతో మళ్లీ కాళ్లబేరానికి వచ్చినా ఆశ్చర్యం లేదు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top