
అసలు లాభం బోర్డుకే!
ముక్కూ మొహం తెలియని క్రీడాకారులకు కూడా కోట్ల రూపాయలు వ స్తున్నాయి.
రెండు రోజుల్లో ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీలు కలిసి ఆటగాళ్లపై ఏకంగా రూ.468 కోట్లు కుమ్మరించాయి. ఇవి కాక బోర్డుకు చెల్లించాల్సిన ఫీజు, మ్యాచ్‌ల నిర్వహణ, ప్రయాణ ఖర్చులూ అన్నీ అదనమే. మరి ఇంత ఖర్చు పెడుతున్న ఫ్రాంచైజీలకు తిరిగి ఏమొస్తుంది? ఇది లాభసాటి వ్యాపారమేనా?
సాక్షి క్రీడావిభాగం
ముక్కూ మొహం తెలియని క్రీడాకారులకు కూడా కోట్ల రూపాయలు వ స్తున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చేసిన మేలు ఇది. మరి ఈ డబ్బులు ఇస్తున్న ఫ్రాంచైజీల సంగతేంటి? రెండు రోజుల పాటు బెంగళూరులో జరిగిన వేలం చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమాని మదిని తొలిచిన ప్రశ్న ఇది. దీనికి సమాధానాలను అంశాల వారీగా చూద్దాం.
ఈ కథనంలో రాస్తున్న అంకెలన్నీ మార్కెట్ వర్గాల అంచనాలు, వివిధ జట్ల ప్రతినిధులు ఏదో ఒక సందర్భంలో చెప్పిన లెక్కలు. అసలు కచ్చితమైన ఆదాయం, వ్యయం గురించి ఏ జట్టూ ఇప్పటివరకు అధికారికంగా ఏమీ చెప్పలేదు.
బీసీసీఐకు ఆదాయం వస్తుందిలా....
ఐపీఎల్ ద్వారా ఏ ఆదాయమైనా మొదటగా వచ్చేది బీసీసీఐ చేతికి. 2008లో లీగ్ ప్రారంభమైన ఏడాదే బోర్డు టెలివిజన్ హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్‌నకు తొలుత రూ.5000 కోట్లకు కేటాయించింది. కానీ తర్వాత రకరకాల వివాదాలు, హక్కుల విషయంలో వచ్చిన విభేదాలతో ఈ ఒప్పందం కాస్తా అదే కంపెనీతో పదేళ్ల కాలానికి రూ.8700 కోట్ల రూపాయలకు పెరిగింది.టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం డీఎల్‌ఎఫ్ సంస్థ మొదటి ఐదు సంవత్సరాలు ఏడాదికి రూ. 50 కోట్లు చెల్లించింది.చివరి ఐదు సంవత్సరాల కోసం ఏడాదికి రూ. 80 కోట్లు చెల్లించేందుకు పెప్సీ ముందుకొచ్చింది.
2011-14 వరకు టైమ్స్ గ్రూప్ మొబైల్, ఇంటర్‌నెట్, రేడియో, బ్రాడ్‌బాండ్ హక్కులను తీసుకుంది. దీని కోసం సుమారు ఏడాదికి రూ.65 కోట్లు చెల్లిస్తోంది.టీమ్స్ ప్రతి ఏడాదీ ఫ్రాంచైజీ ఫీజు కింద డబ్బు చెల్లిస్తాయి. (ఇది ఒక్కో టీమ్‌కు ఒక్కోలా ఉంది. అప్పట్లో టీమ్‌ను ఎంతకు కొన్నారన్న అంశంపై ఆధారపడి ఉంది)ఓవరాల్‌గా బీసీసీఐ ఏడాదికి కేవలం ఐపీఎల్ ద్వారా సుమారు రూ.200 కోట్లు లాభాన్ని గడిస్తోంది. ఇది బోర్డు అధికారికంగా ప్రకటించిన మొత్తం. కాబట్టి ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు ఎలా ఉన్నా బోర్డు ఆదాయానికి మాత్రం ఢోకా లేదు.
ఫ్రాంచైజీల సంగతేంటి?
ఖర్చులు
ప్రతి జట్టూ తొలుత బీసీసీఐకి వార్షిక ఫీజు చెల్లించాలి. చెన్నై ఏడాదికి రూ.45 కోట్లు చెల్లిస్తే... సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.80 కోట్లు ఇస్తోంది. అదే విధంగా ముంబై రూ. 56 కోట్లు ఇస్తోంది. అందరికంటే తక్కువ చెల్లించే జట్టు రాజస్థాన్. ఈ జట్టు ఏడాదికి కేవలం రూ.33 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. ఆయా జట్లు తాము జట్టును కొనుక్కున్నప్పటి ఒప్పందాలను బట్టి ఈ మొత్తం ఉంటుంది.
ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. దీనికి ఒక్కో జట్టు ఈ ఏడాది దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశాయి.
మ్యాచ్‌లను నిర్వహించాలి. దీనికోసం స్టేడియాలకు అద్దె చెల్లించాలి. భద్రతకు డబ్బులు చెల్లించాలి. మ్యాచ్‌లు జరిగే స్టేడియాలు బీసీసీఐకి చెందినవే అయినా... ఏర్పాట్లకు బీసీసీఐకి సంబంధం ఉండదు. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు ఒక్కో జట్టుకు సుమారు రూ. కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది.
ఆటగాళ్లకు వసతి, ప్రయాణ ఖర్చులు, టీమ్ ప్రమోషన్. ప్రతి జట్టూ స్టార్ హోటల్స్‌లో తమ ఆటగాళ్లకు వసతి ఏర్పాటు చేయాలి. అలాగే వేరే నగరాల్లో మ్యాచ్‌లకు విమాన ఖర్చులు, విదేశీ ఆటగాళ్లకు టిక్కెట్లు వగైరా ఖర్చులు చూసుకోవాలి. వీటికి ఏడాది సుమారు రూ.10 నుంచి 15 కోట్లు కావచ్చని అంచనా.
ఓవరాల్‌గా అన్ని జట్లనూ కలిపి ఒక్కో జట్టు సగటున జట్టు కోసం ఏడాదికి రూ.45 కోట్లు చెల్లిస్తుందని అనుకుంటే. ఆటగాళ్ల కొనుగోలు (రూ.60 కోట్లు), సగటున మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చులు (రూ. 8 కోట్లు), వసతి, ప్రయాణాలు వగైరా (సగటున రూ.12 కోట్లు)... ఇవన్నీ కలిపి ఒక్కో జట్టు సగటున ఏడాదికి రూ. 125 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
ఆదాయం
బీసీసీఐ టీవీ రైట్స్ ఆదాయంలో 60 శాతం జట్లకు పంచుతుంది. తొలి రెండు సంవత్సరాలు 70 శాతం, ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 60 శాతం ఆదాయాన్ని ఇచ్చేట్లు ఒప్పందం ఉంది. కాబట్టి దీని ద్వారా బీసీసీఐ... ఫ్రాం ఛైజీలకు ఏడాదికి రూ.510 కోట్లు ఇస్తుంది.
అలాగే టైటిల్ స్పాన్సర్‌షిప్ రూ.60 కోట్లలో 60 శాతం అంటే రూ.36 కోట్లు ఫ్రాంఛైజీలకు వస్తుంది.
ఈ రెండు ప్రధాన ఆదాయ మార్గాలు. వీటి ద్వారా ఒక్కో జట్టుకు సుమారు రూ.70 కోట్లు సమకూరుతుంది.
మ్యాచ్‌ల నిర్వహణ (టిక్కెట్ల డబ్బు), మర్కండైజ్ (టీషర్ట్‌లు వగైరా) ద్వారా ఒక్కో జట్టుకు ఏడాదికి సగటున రూ.10 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా.
ఇక ప్రతి జట్టూ వ్యక్తిగతంగా స్పాన్సర్‌ను తెచ్చుకోవచ్చు. దాదాపు అన్ని జట్లకూ తొలి ఏడాది నుంచీ స్పాన్సర్స్ ఉన్నారు. అయితే ఇది ఎంత మొత్తం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కానీ సగటున ఒక్కో జట్టు ఏడాదికి స్పాన్సర్‌షిప్ ద్వారా కనీసం రూ.30 కోట్లు సంపాదిస్తుందని అంచనా.
ఈ రకమైన అన్ని ఆదాయాలు కలిపితే సగటున ఫ్రాంఛైజీ ఏడాది రూ.110 కోట్లు సంపాదిస్తుంది.
ఆదాయాన్ని, వ్యయాన్ని రెండింటినీ పరిశీలిస్తే... సుమారు రూ.10 నుంచి రూ.15 కోట్లు నష్టం వస్తుంది. ఒకవేళ జట్టు ఆ ఏడాది టైటిల్ గెలిస్తే బీసీసీఐ ఇచ్చే ప్రైజ్‌మనీ రూ.10 కోట్లు.... రన్నరప్‌గా నిలిస్తే రూ.7.5 కోట్లు, అలాగే చాంపియన్స్ లీగ్ ఆడటం ద్వారా డబ్బు... ఇవన్నీ కలిపి చాలా ఫ్రాంఛైజీలు తమ లోటును పూడ్చుకుని బ్రేక్ ఈవెన్‌కు చేరుతున్నాయి.
అందరికీ లాభాల్లేవు
మార్కెట్ వర్గాల నుంచి ఉన్న అంచనా ప్రకారం వేసిన లెక్కలతో సగటున జట్లకు పెద్దగా లాభంగానీ, నష్టంగానీ లేదు. అయితే ఈ పరిస్థితి అన్ని జట్లకూ లేదు. కానీ సగం జట్లు లాభాల్లో, సగం జట్లు నష్టాల్లో ఉన్నాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి సీజన్ నుంచి మార్కెటింగ్ బాగా చేసింది. షారూఖ్ ఇమేజ్ తోడవడంతో తొలి సీజన్‌లోనే లాభాలు సాధించింది.
డబ్బు పొదుపు చేస్తే... సంపాదించినట్లే... రాజస్థాన్ ఈ ఫార్ములాతో ఉంది. ఆటగాళ్ల కోసం తక్కువ ఖర్చు చేయడం, తక్కువ రేటుకు ఫ్రాంఛైజీని దక్కించుకోవడం, తొలి సీజన్‌లో టైటిల్ గెలవడంతో మార్కెట్ పెరగడం ఇవన్నీ కలిపి రాయల్స్‌ను ఒడ్డున పడేశాయి.
చెన్నై జట్టుకూ ఆది నుంచి స్పాన్సర్లు బాగానే ఉన్నారు. దీనికి తోడు ఈ జట్టు ప్రతి సీజన్‌లోనూ నిలకడగా ఆడుతోంది. లీగ్‌లో భారీగా ప్రైజ్‌మనీ సంపాదించడం చెన్నైను గట్టెక్కిస్తోంది.
పంజాబ్ కూడా తొలుత బాగా ఖర్చుపెట్టినా, తర్వాత రాజస్థాన్ శైలిలో పొదుపు బాట పట్టింది.
బెంగళూరు మాత్రం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు... మూడు, నాలుగు జట్లకు కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి లాభాలు ఆశించడం కష్టం.
ఇక ముంబై కూడా టైటిల్ నెగ్గడం కోసం ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేసింది. కాకపోతే ఈ జట్టుకు బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఈ జట్టు కూడా లాభాల్లో ఉండకపోవచ్చు.
అయితే బెంగళూరు, ముంబై రెండూ పారిశ్రామిక దిగ్గజాల జట్లు కావడం వల్ల డబ్బు కంటే ఇక్కడ ప్రచారం బాగా ఎక్కువగా దొరుకుతోంది. ఆ పరంగా వీళ్లూ నిరాశచెందలేదు.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కూడా మొదట్నించీ డబ్బు బాగా ఖర్చు చేసింది. ప్రదర్శన సరిగా లేకపోవడం వల్ల పెద్దగా బ్రాండ్ ఇమేజ్ పెరగలేదు.
సన్‌రైజర్స్ జట్టు గత ఏడాదే లీగ్‌లో అడుగుపెట్టిం
ది. ఏడాదికి వార్షిక ఫీజు కూడా మిగిలిన జట్లతో పోలిస్తే ఎక్కువ చెల్లిస్తోంది. కాబట్టి అప్పుడే లాభాలను ఆశించకపోవచ్చు.