రన్నరప్‌ హరికృష్ణ

Harikrishna finishes second in Rapid Chess Championship   - Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఆదివారం ముగిసిన ఈ ర్యాపిడ్‌ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో లెవాన్‌ అరోనియన్‌ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్‌ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ముఖాముఖి పోరులో అరోనియన్‌పై హరికృష్ణ గెలిచినందుకు హరికృష్ణకు రెండో స్థానం ఖాయమైంది.

అరోనియన్‌ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరిగిన మూడు గేముల్లో హరికృష్ణ రెండింటిలో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయాడు. సెర్గీ కర్జాకిన్‌ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్‌లో హరికృష్ణ 53 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో హరికృష్ణ 95 ఎత్తుల్లో అరోనియన్‌పై... చివరిదైన తొమ్మిదో గేమ్‌లో అతను 37 ఎత్తుల్లో విదిత్‌ (భారత్‌)పై గెలిచాడు. 6 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) చాంపియన్‌గా నిలిచాడు.

ఇతర భారత ఆటగాళ్లు విశ్వనాథన్‌ ఆనంద్, విదిత్, నిహాల్‌ సరీన్, సూర్యశేఖర గంగూలీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. విజేత నకమురకు 10 వేల డాలర్లు (రూ. 7 లక్షల 26 వేలు), రన్నరప్‌ హరికృష్ణకు 5 వేల డాలర్లు (రూ. 3 లక్షల 63 వేలు), అరోనియన్‌కు 4 వేల డాలర్లు (రూ. 2 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళ, బుధ వారాల్లో 18 రౌండ్‌ల బ్లిట్జ్‌ టోర్నీ జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top