విహారి 302 నాటౌట్‌

hanuma vihari 302 not out

‘ట్రిపుల్‌’ సెంచరీ చేసిన ఆంధ్ర కెప్టెన్‌

సాక్షి, విజయనగరం: వరుసగా రెండో రోజు ఒడిషా బౌలర్లపై ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చలాయించారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 584 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ హనుమ విహారి (456 బంతుల్లో 302 నాటౌట్‌; 29 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. రికీ భుయ్‌ (100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వరుసగా రెండో శతకం సాధిం చాడు. విహారి, రికీ భుయ్‌ మూడో వికెట్‌కు 208 పరు గులు జోడించారు. భుయ్‌ అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్‌ సహæకారంతో విహారి తన జోరు కొన సాగించాడు. 312 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న విహారి, 453 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీని అందుకున్నాడు.

విహారి త్రిశతకం పూర్తి కాగానే ఆంధ్ర జట్టు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ‘ట్రిపుల్‌ సెంచరీ’ చేసిన 37వ బ్యాట్స్‌మన్‌గా, ఆంధ్ర తరఫున రెండో బ్యాట్స్‌మన్‌గా విహారి గుర్తింపు పొందాడు. రెండేళ్ల క్రితం ఒంగోలులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేఎస్‌ భరత్‌ (308 నాటౌట్‌) ఆంధ్ర తరఫున తొలి ట్రిపుల్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒడిషా తమ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top