ఆ టైమ్‌లో చాక్లెట్స్‌ తినాలనిపిస్తోంది!

funday health counciling - Sakshi

సందేహం

నాకు పీరియడ్‌ టైమ్‌లో చాక్లెట్లు, తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. దీని వల్ల ఏమైనా సమస్యలు ఏర్పడతాయా? పీరియడ్‌ టైమ్‌లో తీసుకునే ప్రత్యేక ఆహారం అంటూ ఏదైనా ఉందా?
– శ్రీ, పీలేరు

పీరియడ్స్‌ సమయంలో జరిగే అనేక హార్మోన్ల మార్పుల వల్ల, ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి అనేక మార్పులు, లక్షణాలు ఏర్పడతాయి. ఎక్కువ ఆకలి, కొన్ని రకాల పదార్థాలపై కోరిక కలుగుతుంది. ఆ సమయంలో మీకు చాక్లెట్లు, స్వీట్లు తినాలనిపిస్తే కొద్దిగా తీసుకోవచ్చు. దీనివల్ల సమస్య ఏమీ లేదు. కాకపోతే మరీ ఎక్కువగా తింటే, మెల్లిగా బరువు పెరిగే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో బ్లీడింగ్‌ అవ్వడం వల్ల నీరసం, చిరాకు, అలసట వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో తాజా పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పాలు, తాజా పండ్లు, కొద్దిగా మాంసాహారం తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్‌.. పీరియడ్‌ నొప్పిని, వాపులను తగ్గిస్తాయి. ఐరన్, మినరల్స్‌ లాంటివి హిమోగ్లోబిన్‌ పెరగడానికి దోహదపడతాయి. వీటిలో ఉండే ఫైబర్‌ ఈ సమయంలో ఉండే గ్యాస్, యసిడిటీ, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

గర్భిణీ స్త్రీలకు తినకూడని పదార్థాల జాబితా ఏమైనా ఉందా? ఉంటే వివరంగా తెలియజేయగలరు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్లకు కూల్‌డ్రింక్స్‌ తాగే అలవాటు ఉంటే ప్రమాదమా? అనేది తెలియజేయగలరు.
– సుధ, నిర్మల్‌

ప్రెగ్నెన్సీ సమయంలో తాజాగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం.  బాగా ఉడకబెట్టిన ఆహారం, వీటిలో ముఖ్యంగా గుడ్లు, చేపలు, మాంసాహారం చాలా కీలకం. ఇది సరిగా ఉడకబెట్టకుండా, కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే తీసుకుంటే వీటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్‌ పాయిజనై వాంతులు, విరేచనాలు, బిడ్డకు ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జంక్‌ఫుడ్, బయట దొరికే ఆహారం, వేపుళ్లు, మసాలా, నూనె వస్తువులు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌ తీసుకోకపోవడమే మేలు. మరీ మానలేకపోతే ఎంత వీలైతే అంత తగ్గించి తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే కెఫిన్, టానిన్‌ వంటి పదార్థాలు తల్లి జీర్ణవ్యవస్థలో ఇబ్బందులను తేవచ్చు. తినే ఆహారంలో నుంచి ఐరన్, ఇంకా ఇతర పోషకాలను రక్తంలోకి ఎక్కువగా చేరనివ్వకుండా చేస్తుంది. బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్మోకింగ్, ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారైతే ప్రెగ్నెన్సీ టైమ్‌లో మానెయ్యడం మంచిది. అన్నిరకాల పండ్లనూ మితంగా తీసుకోవచ్చు. సూపర్‌ మార్కెట్‌లో దొరికేవి కాకుండా, ఇంట్లోనే తాజాగా తయారు చేసుకున్న పండ్లరసాలను తాగడం మంచిది.

గర్భిణీ స్త్రీలకుprenatal విటమిన్స్, ఫోలిక్‌ యాసిడ్‌ ‘స్టాండర్డ్‌ డైట్‌’ అని చెబుతుంటారు. వీటి గురించి వివరంగా తెలియజేయగలరు.
– ఏఆర్, విజయవాడ

గర్భిణీ స్త్రీలకు, వారిలో జరిగే మార్పులకు, అలాగే కడుపులో పెరిగే శిశువు అవసరాలకు ఎన్నో పోషక పదార్థాలు అవసరం పడతాయి. వీటిలో ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఫోలిక్‌ యాసిడ్‌ ముఖ్యం. ఇది శిశువులోని మెదడు, వెన్నుపూస లోపాలను చాలావరకు నివారిస్తుంది. అలాగే విటమిన్‌–డి, బి–కాంప్లెక్స్‌ విటమిన్లు, క్యాల్షియం వంటివి చిన్న మోతాదులో శిశువు పెరుగుదలకు దోహదపడతాయి. వీటినే ప్రినేటల్‌ విటమిన్స్‌ అంటారు. రోజూవారి తీసుకునే ఆహారంలో అన్నిరకాల విటమిన్స్, మినరల్స్‌ లభ్యం కాకపోవచ్చు. పౌష్టికాహారం తీసుకున్నా.. ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి తిన్న ఆహారంలోని పోషకాలు, రక్తంలోకి సరైన మోతాదులో చేరలేకపోవచ్చు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు ఎంత పౌష్టికాహారం తీసుకున్నా కూడా ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్స్‌ మొదటి మూడు నెలల్లో, తర్వాత నెలల్లో ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, క్యాల్షియం సప్లిమెంట్స్‌ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. అలా అని ఈ ప్రినేటల్‌ విటమిన్స్‌ తీసుకుంటూ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారంలో తాజా కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు. పండ్లు, మాంసాహారులయితే గుడ్లు, చేపలు, చికెన్, మటన్‌ వంటివి బాగా ఉడకబెట్టుకుని తీసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌ ,హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top