
సోమవారం పారిస్ మేయర్ యాని హిడాల్గో నుంచి జ్ఞాపిక స్వీకరిస్తున్న నాదల్
పారిస్: స్పెయిన్ సూపర్ స్టార్ రాఫెల్ నాదల్. క్లే కోర్టుపై మళ్లీ ఈ స్పెయిన్ బుల్ రంకెలేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 11వసారి టైటిల్ గెలిచాడు. ఈ విజయంతో నాదల్ కెరీర్‌లో 17 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ చేరాయి. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డుకు కేవలం మూడే అడుగుల దూరంలో ఉన్న నాదల్ తనకు మాత్రం ‘ఇరవై’పై ప్రత్యేక ధ్యాసలేదన్నాడు. ఆటలో భాగంగా ఆ రికార్డును అధిగమిస్తే సంతోషమే కానీ మరొకరి పేరిట ‘ఆల్‌టైమ్’ రికార్డు ఉందన్న అసూయ తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం ఆస్ట్రియా ప్రత్యర్థి డొమినిక్ థీమ్‌పై వరుస సెట్లలో టైటిల్ గెలిచిన నాదల్ సోమవారం పారిస్ మేయర్ యాని హిడాల్గోతో కలిసి మీడియాతో ముచ్చటించాడు. ‘నాకు 20వ ‘గ్రాండ్’ టైటిల్ ఇష్టమే. ఫెడరర్‌లా భవిష్యత్తులో నేనూ సాధిస్తే మంచిదే. అంతకు మించినా సంతోషమే! కానీ... నిజాయతీగా చెబుతున్నా. అదే పనిగా గెలవాలనే కసి లేదు.
ఇప్పుడైతే తాజా టైటిల్‌ను ఆస్వాదిస్తున్నా. నేనేప్పుడూ నేనే అందరికంటే మిన్నగా ఉండాలనుకోను. అలా ఆలోచించను కూడా. గెలవాలనే లక్ష్యం ఉన్నప్పటికీ... కష్టపడతానే గానీ, నాకంటే ఎక్కువగా మరొకరివద్ద టైటిల్స్ ఉన్నాయనో, ఎక్కువ డబ్బులు ఉన్నాయనో, పెద్ద భవంతి ఉందనో అసూయతో కుమిలిపోను. అలాంటి ఊహల్లో బతకను’ అని నాదల్ చెప్పాడు. వచ్చే నెలలో జరిగే వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన ఫెడరర్ తనకు క్లిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. గతేడాది కూడా ఇలాంటి వ్యూహరచనే చేసిన ఫెడెక్స్ వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. మొత్తానికి వెటరన్ స్టార్లు ఫెడరర్, నాదల్ ఇద్దరు గత ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకోవడంతో యువ ఆటగాళ్లు విలవిల్లాడుతున్నారు.