స్టార్క్ నిప్పులు చెరిగినా.. ఇంగ్లండ్ ఘన విజయం | Sakshi
Sakshi News home page

స్టార్క్ నిప్పులు చెరిగినా.. ఇంగ్లండ్ ఘన విజయం

Published Fri, Jan 19 2018 5:34 PM

England wins second odi against australia - Sakshi

బ్రిస్బేన్‌: పటిస్ట ఆస్ట్రేలియా జట్టుపై రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఆసీస్ విసిరిన 271 పరుగుల లక్ష్యాన్ని మరో 34 బంతులుండగానే ఛేదించి ఐదు వన్డేల సిరీస్‌లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు 2-0తో ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న జో రూట్ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు.

తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు తొలి వికెట్ కు డేవిడ్ వార్నర్‌ (35)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు ఫించ్. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జో రూట్ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18), ట్రావిస్ హెడ్ (7)లను స్వల్ప విరామాల్లో పెవిలియన్ బాట పట్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించిన ఫించ్ (114 బంతుల్లో 106, 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ అనంతరం ప్లంకెట్ బౌలింగ్‌లో ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు. చివర్లో కారే (27) పరవాలేదనిపించాడు. వోక్స్ అద్భుత ఫీల్డింగ్‌తో కారే, టై (8)లు రనౌట్ అయ్యారు. ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లాడి 9 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.

271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఇన్నింగ్స్ నాలుగో బంతికి ఓపెనర్ జాసన్ రాయ్ (2)ను ఔట్ చేశాడు. బెయిర్ స్టో (60), అలెక్స్ హేల్స్ (57)లు రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం (117) అందించారు. ఓ వైపు స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో (4/59) మోర్గాన్ (21), జోస్ బట్లర్ (42), మొయిన్ అలీ (1)లను పెవిలియన్ బాట పట్టించినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాలు జట్టుకు తోడ్పడ్డాయి. బెయిర్ స్టో ఔటయ్యాక క్రీజులోకొచ్చిన జో రూట్ (46 నాటౌట్), క్రిస్ వోక్స్ (27 బంతుల్లో 39) తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. దీంతో 44.2 ఓవర్లోనే మోర్గాన్ సేన 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో వన్డేలోనూ విజయం సాధించిన ఇంగ్లండ్ ఐదు వన్డేలో సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. మరో వన్డే నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

కొసమెరుపు
ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ శతకాలతో చెలరేగినా ఆ జట్టు ఓటమి పాలైంది. తొలి వన్డేలో ఫించ్ (107) శతకంతో చెలరేగడంతో ఆసీస్ జట్టు 300కు పైగా స్కోరు చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో వన్డేలోనూ ఫించ్‌(114 బంతుల్లో 106, 9 ఫోర్లు, 1 సిక్స్‌)  సెంచరీ చేసినా జట్టు ఓటమిపాలు కావడం గమనార్హం.
 

Advertisement
Advertisement