అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) జట్లు విజేతలుగా నిలిచాయి.
సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) జట్లు విజేతలుగా నిలిచాయి. బెంగళూరులోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (కేఐఓసీ)లో నిర్వహించిన సీనియర్స్, జూనియర్స్ విభాగాలు రెండింట్లోనూ ఈసీడీజీ గెలుపొందింది.
ఈ టోర్నీలో ఈసీడీజీ, కేఐఓసీతోపాటు మూడో జట్టుగా బెంగళూరుకు చెందిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ జట్టు పాల్గొంది. శుక్రవారం జరిగిన జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 8 పరుగుల తేడాతో కేఐఓసీపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఫరీదుద్దీన్ (49), ఆర్యన్ కాక్ (40), ఫర్హాన్ (32)లు రాణించారు. కేఐఓసీ బౌలర్లలో ధ్రువ్ మూడు, శివం రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో కేఐఓసీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివం (68), ఆయుష్ (43) రాణించారు. ఈసీడీజీ బౌలర్లు ముస్తాక్, నాసర్, ఫరీద్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక సీనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 70 పరుగుల తేడాతో కేఐఓసీపై ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ 197 (20 ఓవర్లలో 9 వికెట్లకు) పరుగుల భారీస్కోరు సాధించగా, కేఐఓసీ జట్టు 127 (20 ఓవర్లలో 9 వికెట్లకు) పరుగులే చేయగలిగింది.