జొకోకు షాక్ | Djokovic Seeks Perspective After Loss To Querrey At Wimbledon | Sakshi
Sakshi News home page

జొకోకు షాక్

Jul 3 2016 2:08 AM | Updated on Sep 4 2017 3:59 AM

జొకోకు షాక్

జొకోకు షాక్

వింబుల్డన్‌లో ఆరో రోజు అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న

మూడోరౌండ్‌లోనే వెనుదిరిగిన నంబర్‌వన్
 క్యాలెండర్ స్లామ్ ఆశలు ఆవిరి
 సామ్ క్వెరీ చేతిలో ఓటమి
 ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, ముర్రే

 
 లండన్: వింబుల్డన్‌లో ఆరో రోజు అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు అనూహ్యమైన షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగినా... ఓ తక్కువ ర్యాంక్ ఆటగాడి చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు. శనివారం ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 7-6 (8/6), 6-1, 3-6, 7-6 (7/5)తో టాప్‌సీడ్ జొకోవిచ్‌పై సంచనల విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 2008లో మారన్ చేతిలో రెండో రౌండ్‌లోనే ఓడిన జొకోవిచ్.. ఆ తర్వాత జరిగిన ప్రతి టోర్నీలో కనీసం క్వార్టర్స్‌కైనా చేరుకున్నాడు.
 
 కానీ ఈసారి మూడోరౌండ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2009 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఇంత తొందరగా జొకోవిచ్ వెనుదిరగడం ఇదే మొదటిసారి. మొత్తానికి 1969 (రాడ్ లేవర్) తర్వాత ‘క్యాలెండర్ స్లామ్’ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలన్న  కల నెరవేరలేదు. అలాగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 30 వరుస విజయాలకూ బ్రేక్ పడింది.
 
 క్వెరీతో రెండు గంటలా 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కొన్నిసార్లు అనూహ్యంగా వెనుకబడ్డాడు. శుక్రవారం మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా శనివారానికి వాయిదా పడింది. అయితే అప్పటికే తొలిరెండు సెట్లు కోల్పోయిన జొకోవిచ్ మూడోసెట్‌లో మాత్రం బాగా పుంజుకున్నాడు. తన ఫామ్‌ను చూపెడుతూ 5-0 ఆధిక్యంతో సెట్‌ను చేజిక్కించుకున్నాడు.
 
 ఇక నాలుగో సెట్‌లోనూ ఆరంభంలో అద్భుతంగా ఆడిన సెర్బియన్ 5-4 ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఈ దశలో సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. దీంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లినా.. చకచకా పాయింట్లతో ముందంజ వేశాడు. కానీ చివర్లో చేసిన ఫోర్‌హ్యాండ్ తప్పిదానికి అతి పెద్ద మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో క్వెరీ 31 ఏస్‌లు, 56 విన్నర్లు సంధించాడు.  
 
 ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ ముర్రే (బ్రిటన్) 6-3, 7-5, 6-2తో జాన్ మిల్‌మన్ (ఆస్ట్రేలియా)పై; మూడోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-2, 6-2తో ఇవాన్స్ (బ్రిటన్)పై; ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-3, 7-5తో కుజ్‌నెత్సోవ్ (రష్యా)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-4తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 
 ప్రిక్వార్టర్స్‌లో కెర్బర్: మహిళల సింగిల్స్ మూడోరౌండ్‌లో నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-6 (11), 6-1తో విటోఫ్ట్ (జర్మనీ)పై; ఐదోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై; సఫరోవా (చెక్) 4-6, 6-1, 12-10తో సెపలోవా (స్లొవేకియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. అయితే పదోసీడ్ క్విటోవా (చెక్) మాత్రం రెండోరౌండ్‌లోనే ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement