భారత షూటర్లు అపూర్వి చండేలా, అయోనికా పాల్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్లో భారత్కు మరో మూడు పతకాలు వచ్చాయి. శనివారం జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మరో రెండు పతకాలు వరించాయి. భారత షూటర్లు అపూర్వి చండేలా, అయోనికా పాల్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.
అపూర్వి చండేలా 206.7 పాయింట్లు, అయోనికా పాల్ 204.9 పాయింట్లు సాధించి ఇతరులకు అందనంత దూరంలో నిలిచారు. ఇదే ఈవెంట్లో మూడో స్థానంతో కాంస్యం గెల్చుకున్న నుర్ సుర్యానీ 184.4 పాయింట్లే నెగ్గడం గమనార్హం. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించగా, శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్లు ఇప్పటివరకు ఐదు పతకాలు కైవసం చేసుకున్నారు.