‘విరాట్‌ కోహ్లిపై అదంతా కట్టుకథే’

BCCI Rubbishes Report That Virat Kohli Was Told To Be Humble - Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో హుందాగా వ్యవహరించాలని భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లిని సీఓఏ ఆదేశించినట్లు వచ్చిన వార్తలో నిజం లేదని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు టీమిండియా శుక్రవారం భారత్‌ నుంచి అక్కడికి వెళ్లింది. పర్యటనకు ముందు విరాట్ కోహ్లిని సీఓఏ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

‘ఆస్ట్రేలియా పర్యటనలో సత్ప్రవర్తనతో మెలగాలి. నోటిని అదుపులో ఉంచుకుని ఉండు. ప్రధానంగా మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా హుందాగా వ్యవహరించు’ అని ముంబైకి చెందిన పత్రికలో ఇటీవల వార్త వచ్చింది. ఈ క్రమంలోనే కోహ్లికి సీఓఏ మెమో ఇచ్చిందని రాశారు. అయితే అందులో ఎటువంటి లేదంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. అదంతా ఒట్టి కట్టుకథేనని తెలిపింది. విరాట్‌ కోహ్లికి సీఓఏ నుంచి ఎటువంటి హెచ‍్చరికలు రాలేదంటూ క్లారిటీ ఇచ్చింది.

గత పర్యటనలో విరాట్‌ స్థానిక అభిమానులకు మధ్య వేలు చూపించాడు. కాగా వారు తనతో అనవసర కవ్వింపులకు దిగడంతో అలా చేశానని మరోసారి సహనం కోల్పోనని తర్వాత వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆటనే తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని ఇటీవల ఓ అభిమాని ట్విట్టర్‌లో పెట్టిన కామెంట్‌కి ఘాటుగా స్పందించిన విరాట్ కోహ్లి.. అయితే నువ్వు దేశం విడిచి వెళ్లు అని సమాధానమిచ్చాడు.  ఈ క్రమంలోనే సీఓఏ.. కోహ్లికి ముందుగా హెచ్చరికలు జారీ చేసిందంటూ వార్తలు హల్‌చేశాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top