అమిత్‌ నయా చరిత్ర | Sakshi
Sakshi News home page

అమిత్‌ నయా చరిత్ర

Published Fri, Sep 20 2019 4:46 PM

Amit Panghal Creates History In World Championship - Sakshi

ఎకతెరీన్‌బర్గ్‌(రష్యా): ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ కొత్త అధ్యాయానికి తెర లేపింది. భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ ఫైనల్‌కు చేరి కొత్త చరిత్ర సృష్టించాడు.  మూడున్నర దశాబ్దాల చరిత్రగల ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఒక భారత బాక‍్సర్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌ బౌట్‌లో భాగంగా 52 కేజీల ఫ్లైవెయిట్‌ కేటగిరిలో అమిత్‌ 3-2 తేడాతో సాకన్‌ బిబోస్సినోవ్‌(కజికిస్తాన్‌)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన బౌట్‌లో కడవరకూ నిలబడ్డ అమిత్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇక మరో భారత బాక్సర్‌ మనీష్‌ కౌశిక్‌ తన పోరును  సెమీస్‌లోనే ముగించడంతో కాంస్యతోనే సరిపెట్టుకున్నాడు. ఆండ్రీ క్యూజ్‌తో జరిగిన పోరులో మనీశ్‌ ఓటమి పాలయ్యాడు.

శనివారం జరుగనున్న ఫైనల్‌ పోరులో ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్‌ షాకోబిదిన్‌ జైరోవ్‌తో అమిత్‌ స్వర్ఱ పతకం కోసం తలపడనున్నాడు.  గతంలో  ఏ ఒక్క ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌ కాంస్యాన్ని మించి గెలవలేకపోయింది. విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధురి (2017) కాంస్యం నెగ్గారు. ఇప్పుడు అమిత్‌ ఫైనల్‌కు చేరడంతో రజతం ఖాయం చేసుకుని కొత్త చరిత్రకు నాంది పలికాడు.

Advertisement
Advertisement