బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ: పాక్ క్రికెటర్
విరాట్ కోహ్లీనే ప్రపంచ అత్యున్నత బ్యాట్స్‌మన్ అని పాక్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు.
కరాచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే ప్రపంచ అత్యున్నత బ్యాట్స్‌మన్ అని పాక్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. ట్వీటర్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన అమీర్‌ను అభిమానులు ప్రపంచ అత్యున్నత బ్యాట్స్‌మన్ ఎవరూ అని ప్రశ్నించగా.. కోహ్లీతో పాటు జోరూట్, విలియమ్సన్, స్టీవ్‌స్మిత్‌లని సమాధానమిచ్చాడు. అభిమానులు వీరిలో బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరినో ఒకరినే ఎంచుకోవాలని సూచించడంతో అందరూ గొప్ప ఆటగాళ్లే.. నా బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీనే అని తెలిపాడు. మరో అభిమాని అమీర్‌ను మీరు ఆడిన తొలి చాంపియన్స్ ట్రోఫీలో సచిన్ వికెట్ తీశారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ వికెట్ పడగొట్టారు.. ఏ వికెట్ ఎక్కువగా సంతోషాన్నించింది అని ప్రశ్నించగా.. కీలకమైన రెండు వికెట్లు తీయడం సంతోషాన్నిచ్చిందని అమీర్ తెలిపాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ స్పీడ్ స్టార్ (6-2-16-3)తో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం అమీర్‌ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ తన తప్పులను సరిదిద్దుకోని రాణించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ అనేక సందర్భాల్లో స్నేహంగా ఉంటూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. కోహ్లీ తన బ్యాటును అమీర్ కు బహుమానంగా కూడా ఇచ్చాడు.