డివిలియర్స్‌ వస్తానంటే.. వద్దన్నారు

AB de Villiers wanted to come out of retirement for World Cup - Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్‌ ఉంటే బాగుండు అని అనుకోని అభిమాని ఉండడు. ఎందుకంటే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన సఫారీ జట్టు పసికూనలా మారిపోయింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌లో డివిలియర్స్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంగ్లండ్‌ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో ఆడేందుకు డివిలియర్స్‌ ప్రయత్నాలు చేయగా.. మేనేజ్‌మెంట్‌ సున్నితంగా తోసిపుచ్చిందని వార్తలు వస్తున్నాయి. 

దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ గతేడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు చెప్పి క్రికెట్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కీలక ప్రపంచకప్‌ దృష్ట్యా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డివిలియర్స్‌ భావించాడు. ఈ విషయాన్ని గత ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, హెడ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్, సెలక్టర్లను కలిసి మళ్లీ జట్టులోకి రావాలని ఉందని తన మనుసులోని మాటను వెల్లడించినట్టు సమాచారం.
అయితే డివిలియర్స్‌ అభ్యర్థనను దక్షిణాప్రికా క్రికెట్‌ బోర్డు ఏ మాత్రం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వరల్డ్‌కప్‌ కోసం 15 మంది స‌భ్యుల బృందం ఇంగ్లాండ్‌కు ప‌య‌న‌మ‌వ్వడానికి 24 గంట‌ల ముందే డివిలియర్స్ ఈ విషయాన్ని చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. అయితే ప్రపంచకప్‌లో వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుండంతో డివిలియర్స్‌ విషయంలో తప్పుచేశామననే భావనలో సఫారీ మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని అభిమానులకు డివిలియర్స్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘వరల్డ్‌కప్ మన జట్టుకి మద్దతు తెలపడంపై మనమంతా శ్రద్ధ పెట్టాలి. ఇంకా టోర్నీలో ఆడాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. మన ఆటగాళ్లు పుంజుకుంటారని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ డివిలియర్స్‌ పోస్ట్‌ చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top