వైవిధ్యానికి మారుపేరు

special on Basanta Kumar Biswas  - Sakshi

‘డిసెంబర్‌ 23, 1912... ఈ తేదీ జాతీయవాది అయిన ప్రతి భారతీయుడి గుండెలలోను పదిలంగా ఉండిపోవాలి. బ్రిటిష్‌ సామ్రాజ్యం మీద బసంత్‌ కుమార్‌ బిశ్వాస్‌ చావు దెబ్బ కొట్టిన తేదీ ఇదే!’ మహదానందంతో అన్నాడాయన. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి అక్కడే భారతీయ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నలందా క్లబ్‌లోకి ప్రవేశిస్తూనే ఈ మాట అన్నారు. పేరు లాలా హరదయాళ్‌. ఆయన క్లబ్‌లోకి ప్రవేశించడంతోనే ఒక రాక్‌స్టార్‌ను చూసినంత సంబరంగా చూశారు విద్యార్థులు. అంత ఆరాధన ఆయనంటే. 

లాలా హరదయాళ్‌ పేరు భారతదేశ చరిత్రలో రెండు వాక్యాలకు కూడా నోచుకోలేదు. కానీ ఆయన జీవితం, ఉద్యమం, ఆలోచన అద్భుతమనిపిస్తాయి. చదివింది సంస్కృతం. ఆపై ఇంగ్లిష్‌తో పాటు కొన్ని ప్రపంచ భాషలు కూడా నేర్చారు. అమెరికా, బ్రిటన్, అల్జీరియా, ఫ్రాన్స్, జపాన్‌ వంటి దేశాల వెంట తీవ్ర జాతీయవాద ఉద్యమంలో భాగంగా కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. అసాధారణమైన అధ్యయనం. మాతృభూమి మీద అపారమైన భక్తి. మరో పక్క రష్యన్‌ అనార్కిజం మీద మమకారం. ఒక పక్క బౌద్ధం మీద ఆసక్తి. ఇంకో పక్క బొల్షివిజం విజయాల మీద అనురక్తి. ఇంత వైవిధ్యమైన ఈ జీవితం లాలా హరదయాళ్‌కే సొంతం. 
బ్రిటిష్‌ జాతి నుంచి భారతదేశాన్ని విముక్తం చేయాలన్న ఆకాంక్ష భారత జాతీయ కాంగ్రెస్‌ సొంతం కాదు.

 నిజానికి జాతీయ కాంగ్రెస్‌ తొలినాటి ఆశయం ఈ దేశం నుంచి బ్రిటిష్‌ జాతి నిష్క్రమించడం కాదు కూడా. జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమం తొలిదశ (1885–1905)లో ఈ వైఖరి సుస్పష్టం. విన్నపాలతో, వినతిపత్రాలతో వేడుకోవడం వినా మరో మార్గం లేదని ఆనాటి నాయకత్వం భావించింది. ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషించిన భారతీయులు కోకొల్లలు. గదర్‌ పార్టీ నేపథ్యాన్ని చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. తరువాత కాలాలలో ఆవిర్భవించిన హిందుస్తాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ల ఆశయం కూడా ఇదే బాటలో సాగింది. తుపాకీని తుపాకీతోనే ఎదిరించాలన్నది వారి సిద్ధాంతం. 

 బ్రిటిష్‌ పాలకుల అకృత్యాలు అలాంటి యువకులను సాయుధ పోరుబాట పట్టేలా చేశాయి. సోహన్‌సింగ్‌ భాక్నా, కర్తార్‌సింగ్‌ శరభ, రాస్‌బిహారీ బోస్, శ్యామ్‌జీ కృష్ణవర్మ, దర్శి చెంచయ్య, పృథ్వీసింగ్‌ ఆజాద్‌ వంటి జాతీయ వాదులు పనిచేసిన గదర్‌ పార్టీ 1913లో అమెరికాలో ఆవిర్భవించింది. జాతీయవాదాన్ని నమ్ముతూ, కన్నుకు కన్ను సిద్ధాంతంతో ఆవిర్భవించిన గదర్‌ పార్టీ ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించినవారే లాలా హరదయాళ్‌.‘నీవు విదేశాలలోనే ఉంటూ స్వాతంత్య్ర పోరాటానికి అండదండలను ఇవ్వు. 

ఈ పోరుకు విదేశాలలో ఉంటున్న భారతీయల సంఘీభావాన్ని కూడగట్టు’ అని లాలా లజపతిరాయ్‌ ఇచ్చిన సలహా మేరకే హరదయాళ్‌ విదేశాలలో ఉండి పనిచేశారు. మరి ఇంకెప్పుడూ ఆయన మాతృభూమికి తిరిగి రాలేదా? రాలేదు. లాలా హరదయాళ్‌ (అక్టోబర్‌ 14, 1884–మార్చి 4, 1939) ఢిల్లీలో పుట్టారు. తల్లి భోలీ రాణి, తండ్రి గౌరీ దయాళ్‌ మాథుర్‌. మొదటి నుంచి ఆయన మంచి విద్యార్థి. ఢిల్లీలోని కేంబ్రిడ్జ్‌ మిషన్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో సంస్కృతం ప్రధానాంశంగా గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆపై పంజాబ్‌ శ్వవిద్యాలయంలో చేరి ఒక్క సంవత్సరంలోనే సంస్కృతంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి, తరువాత ఆంగ్ల సాహిత్య విద్యార్థిగా చేరారు.

 అన్ని స్థాయిలలోను అతడు చూపించిన ప్రతిభకు విస్తుపోయిన ప్రభుత్వం తనకు తానుగానే ఆయనకు విద్యార్థి వేతనం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ వేతనంతోనే ఆయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ ఉండగానే ‘ది సోషియాలజిస్ట్‌’ పత్రికను నిర్వహిస్తున్న గై అల్‌డ్రెడ్‌తో పరిచయం కలిగింది. అల్‌డ్రెడ్‌ అనార్కిస్ట్‌ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. ఆ పత్రికలోనే హరదయాళ్‌ తొలి రచన అచ్చయింది. తన ఆశయం ప్రభుత్వాన్ని సంస్కరించడం కాదు, దానిని సమూలంగా నిర్మూలించడమని అందులో పేర్కొన్నారు.

 దీనితోనే ఇంగ్లండ్‌ గూఢచర్య విభాగం ఆయన మీద నిఘా పెట్టింది. అప్పటికే ఆయన ఐసీఎస్‌ పరీక్షకు సిద్ధమవుతున్నారు. 1907లో దానిని కూడా వదిలిపెట్టేశారు. 1908లో భారతదేశానికి వచ్చి కొంతకాలం ఉన్నారు. అప్పుడే లాలా లజపతిరాయ్‌ సలహా మేరకు పారిస్‌ వెళ్లిపోయారు. అక్కడే మేడం కామా నడుపుతున్న  ‘వందేమాతరం’, ‘తల్వార్‌’ పత్రికలకు సంపాదకత్వం వహించారు (గదర్‌ పార్టీ ఆవిర్భావం తరువాత ఉర్దూ, గుర్ముఖి భాషలలో వెలువరించిన గదర్‌ పత్రికను స్థాపించినవారు కూడా ఆయనే). పారిస్‌ నుంచి మళ్లీ అల్జీరియా, అక్కడ నుంచి మార్టినిక్‌లకు ఆయన వెళ్లారు. చివరికి 1911లో అమెరికా చేరుకుని, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తత్త్వశాస్త్ర విభాగాలలో ఆచార్యునిగా చేరారు. ఆయన అక్కడ పాఠాలు చెప్పడానికే పరిమితం కాలేదు.

 కార్మికులను, భారత జాతీయులను ఐక్యం చేయడం కోసం ఎంతో పనిచేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ చాప్టర్‌కు కార్యదర్శిగా పనిచేశారు. రష్యా దేశపు అరాచకవాద సిద్ధాంతకర్త మైఖేల్‌ బకూనిన్‌ అన్నా హరదయాళ్‌కు ఆరాధన. అనార్కిస్ట్‌ సిద్ధాంతవేత్త ఆయనే. బకూనిన్‌ పేరుతో అక్కడ ఒక అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. ఓక్లాండ్‌లో ఆరు ఎకరాల స్థలాన్ని ఒక సంస్థ ఇవ్వడంతో అందులోనే ఆ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. అనార్కిజానికి ఇది మొదటి ఆరామమని హరదయాళ్‌ చెప్పేవారు.

 వీటన్నిటి ఫలితంగానే ఆయన స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆపై హరదయాళ్‌ కాలిఫోర్నియాలోని స్టాక్టన్‌లో ఉన్న రైతులతో స్నేహం పెంచుకున్నాడు. అక్కడ ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గురుగోవింద్‌ సింగ్‌ పేరిట విద్యార్థి వేతనం ఏర్పాటు చేశాడు. లండన్‌లో శ్యామ్‌జీకృష్ణవర్మ నిర్వహిస్తున్న తీరులోనే భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులకు ఒక వసతి గృహం ఏర్పాటు చేశారు. ఆరుగురు విద్యార్థులు ఈ కేంద్రానికి రావడానికి అంగీకరించారు. 

ఆ ఆరుగురు విద్యార్థులలో నందసింగ్‌ షెరా, దర్శి చెంచయ్య, గోవింద బెహారీలాల్‌ కూడా ఉన్నారు. వీరంతా వసతి గృహంలో ఉంటూ భారతదేశంలో వైస్రాయ్‌ని చంపడం గురించి పథకాలు రచిస్తూ ఉండేవారు.  మొదటి ప్రపంచయుద్ధం ఆరంభానికి కొంచెం ముందు ఆరంభించిన గదర్‌ పార్టీ ఒక దావానలంలా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆకర్షించింది. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం ఒత్తిడి మేరకు, అనార్కిస్ట్‌ కార్యకలాపాలు నెరపుతున్నాడన్న ఆరోపణతో 1914, ఏప్రిల్‌లో అమెరికా ప్రభుత్వం హరదయాళ్‌ను అరెస్టు చేసింది. 

అరెస్టు చేసినప్పటికీ ఆయనను ఇండియా పంపేయాలన్న బ్రిటిష్‌ ప్రభుత్వం డిమాండ్‌ను మాత్రం అమెరికా అంగీకరించలేదు. హరదయాళ్‌ చాలా శ్రమించి బెయిల్‌ తెచ్చుకున్నారు. అక్కడ నుంచి బెర్లిన్‌ పారిపోయారు. అప్పటికే బెర్లిన్‌ కేంద్రంగా విప్లవ కార్యకలాపాలు నడుపుతున్న వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ, ఎం.బర్కతుల్లా, చంపకరామన్‌ పిళ్లై, భూపేంద్రనాథ్‌ దత్‌లను కలుసుకున్నారు. ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ కమిటీని ఏర్పాటు చేసి, భారతదేశంలో అణచివేతకు గురవుతున్న తీవ్ర జాతీయవాదులకు ఆశ్రయం కల్పించేవారు. 

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పదేళ్ల పాటు హరదయాళ్‌ స్వీడన్‌లో ఉన్నారు. అక్కడే కళాశాలల్లో భారతీయ సాహిత్య, తత్వశాస్త్రాలను బోధించారు. మళ్లీ 1930లో లండన్‌ యూనివర్సిటీలో పరిశోధన చేసి, డాక్టరేట్‌ తీసుకున్నారు. లజపతిరాయ్‌ సలహా మేరకు హరదయాళ్‌ ఫ్రాన్స్‌ వచ్చారు. కొద్దికాలం మాత్రమే ఉన్నారు. ఆ దేశ వాతావరణం ఆయనకు నచ్చలేదు. అందుకే అల్జీరియా వెళ్లిపోయారు. ఆ దేశం కూడా ఆయనకు నచ్చలేదు. క్యూబా లేదా జపాన్‌ వెళ్లాలనుకున్నారు. 

ఆ క్రమంలో మార్టినిక్‌ వెళ్లారు. అక్కడే ఆయన పూర్తి నిరాడంబర జీవితం ఆరంభించారు. ఇక్కడ ఉండగానే ఆర్య సమాజ్‌ ప్రచారకుడు భాయి పరమానంద్‌ ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఈ ఇద్దరు నిరంతరం చర్చించుకునేవారు. బౌద్ధానికి సమీపంగా ఉండే ఒక కొత్త మతం అవసరం ఉందని కూడా భావించారు. పరమానంద్‌ సలహా మేరకు తిరిగి అమెరికా వెళ్లి అక్కడ భారతీయ పురాతన సంస్కృతి, ఆర్యజాతి గురించి బోధించడానికి హరదయాళ్‌ అంగీకరించారు. బోస్టన్, కాలిఫోర్నియా, ఆపై హోనొలూలు (హవాయ్‌) వెళ్లారాయన. 

అక్కడే వైయాక్కి బీచ్‌లో తపస్సు చేశారు. చిత్రంగా జపాన్‌ దేశం నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులతో పరిచయం ఒకవైపు, మార్క్సిజం గురించి అధ్యయనం మరోవైపు ఆయన జీవితంలో అక్కడ జరిగిన పరిణామాలు. ఆయన ఎన్నో రచనలు చేశారు. విద్య మీద ఆలోచనలు, హిందూ జాతి సామాజిక విజయం, లాలా హరదయాళ్‌ రచనలు, జర్మనీ, టర్కీలలో నలభయ్‌ నాలుగు మాసాలు అందులో కొన్ని. 

హరదయాళ్‌ జీవన ప్రస్థానం ఎవరికైనా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అలాగే ఆయన పాండిత్యం కూడా. సంస్కృతంతో పాటు ఆయన ఉర్దూ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్‌ భాషలలో విశేషమైన పాండిత్యం సంపాదించారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఆయన నిరాడంబర జీవితం మరొక ఎత్తు. ఆయన సాధారణంగా ఒక సన్యాసాశ్రమంలో వ్యక్తిలా జీవించేవారు. ఉడికించిన గింజలు, బంగాళాదుంపలు మాత్రమే తింటూ, నేల మీద పడుకునేవారు. 1908లో భారతదేశం వచ్చినప్పుడు హరదయాళ్‌ వివాహం చేసుకున్నారు. ఆమె పేరు సుందరరాణి. రెండేళ్ల తరువాత ఒక కొడుకు పుట్టాడు.

 కానీ కొద్దికాలానికే చనిపోయాడు. తరువాత కూతురు పుట్టింది. సుందరరాణి భర్తతో కాపురం చేసిన కాలం చాలా తక్కువ. ఇక కూతురు (శాంతి) జీవితకాలంలో తన తండ్రిని చూడలేదు. హరదయాళ్‌ ఫిలడెల్ఫియాలో ఆకస్మికంగా కన్నుమూశారు. గుండె ఆగి మరణించారని మొదట తేల్చారు. కానీ ఆ మరణం ఒక మిస్టరీగానే చరిత్రలో మిగిలిపోయింది. హరదయాళ్‌తో కలసి పనిచేస్తూ, ‘భారతమాత సొసైటీ’ని స్థాపించిన ఆయన మిత్రుడు లాలా హనుమంత్‌ సాహే అది సహజ మరణం కాదని చెప్పేవారు. విషప్రయోగం జరిగిందని సాహే ప్రగాఢ నమ్మకం.

Read latest Specials News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top