తండ్రి కట్టుబాట్లకు విసిగి.. టిక్‌టాక్‌ క్రేజ్‌తో..

A 14 Year Old Girl Runs Away From Home to Meet Tik Tok star in Nepal - Sakshi

ముంబై : టిక్‌టాక్‌ క్రేజ్‌ ఒకవైపు.. తండ్రి కట్టుబాట్లు మరోవైపు ఆ అమ్మాయిని ఇంటిని వదిలి పారిపోయేలా చేశాయి. ముంబైకి చెందిన 14 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి.. అబ్బాయిలతో మాట్లడవద్దని, అమ్మాయి అంటే ఇలానే ఉండాలని తన తండ్రిపెట్టే కట్టుబాట్లతో తీవ్రంగా విసిగిపోయింది. అంతే కాకుండా టిక్‌టాక్‌లో తాను పిచ్చిగా అభిమానించే వ్యక్తిని కలవాలనే ఆరాటంతో తల్లిదండ్రులనే కాదని ఇంటిని వీడింది. వెళ్తూ వెళ్తూ.. తన తల్లికి ఓ భావోద్వేగపు లేఖను రాసింది.

‘మమ్మీ నేను ఇంటిని వదిలి వెళ్తున్నాను. నాన్న కట్టుబాట్లు, ప్రవర్తన నన్ను తీవ్రంగా బాధపెట్టాయి. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నేను ఇంటి నుంచి వెళ్లాననే కారణంతో నీవు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఆ దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నేను ఓ అబ్బాయితో వెళ్లిపోయానని అనుకుంటే మాత్రం నువ్వు కూడా తప్పుగా ఆలోచించినట్టే. నేను లేచిపోవట్లేదు( ఏ అబ్బాయితో వెళ్లిపోవడం లేదు). ఇంటి నుంచి వెళ్లిపోతున్నా అంతే!’ అని ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖను చూసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ ప్రారంభించి 8 గంటల్లోపే ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ అమ్మాయికి నేపాల్‌కు చెందిన 16 ఏళ్ల కుర్రాడు, టిక్‌టాక్‌ స్టార్‌ రియాజ్‌ అఫ్రీన్‌ అంటే ఇష్టమని, అతన్ని కలవడానికే వెళ్లిందని స్నేహితురాళ్లు ఇచ్చిన క్లూతో పోలీసులు ఆ అమ్మాయిని గుర్తించి తీసుకొచ్చారు. తన తండ్రి పెట్టిన కట్టుబాట్లను తట్టుకోలేక ఇంటిని వీడినట్లు ఆ అమ్మాయి పోలీసులకు తెలిపింది. స్నేహితులైన అబ్బాయిలతో మాట్లాడితే తన తండ్రి అరిచాడని, అప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నట్లు ఆ టీనేజర్‌ తన మనసులోని బాధను వెల్లడించింది.

ఇక టిక్‌టాక్‌ యువత, చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యాప్‌ద్వారా పాపులర్‌ అవ్వాలనే ఉద్దేశంతో యువత ఎంతటికైనా తెగిస్తున్నారు. దీంతో ఈ యాప్‌లో అశ్లీలత, బూతులకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ యాప్‌ను నిషేధించాలనే డిమాండ్‌ వ్యక్తమైంది. ముఖ్యంగా టీనేజర్లు ఇలాంటి యాప్‌లకు బానిసలవుతున్నారని, వీటి బారిన పడకుండా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top