ఆశావహులపై ‘పంచాయతీ’ నీళ్లు | Sakshi
Sakshi News home page

ఆశావహులపై ‘పంచాయతీ’ నీళ్లు

Published Thu, Jan 4 2018 4:20 PM

election commission notices to leaders in siddipet district

సాక్షి, సిద్దిపేట: స్థానిక ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మరో షాక్‌ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల మార్పులతో పాటు విద్యార్హత, వార్డు సభ్యుల ద్వారా ఎన్నిక.. అంటూనే గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చుల వివరాలు తెలియజేయని అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జిల్లాలో 991 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ నోటీసులు అందుకున్నవారిలో 176 మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు ఉండటం గమనార్హం.

షోకాజ్‌ నోటీసులతో సతమతం
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేసి సందర్భంగా అయిన ఖర్చు, ఇతర వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించని కారణంగా.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించవద్దంటూ జిల్లాలోని 991 మందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందులో 815 మంది ఓటమిపాలైన వారు ఉండగా.. 176 మంది గెలిచి ఇప్పటి వరకు పదవిలో కొనసాగుతున్నవారు ఉండటం గమనార్హం. గత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల స్వరూపాలు మారిపోయాయి. మండలాలు, పంచాయతీలు వేర్వేరు జిల్లాల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి వేరైన సిద్దిపేట జిల్లాలో వరంగల్, కరీంనగర్‌ జిల్లాల నుంచి పలు గ్రామాలు కలిశాయి. దీంతో జిల్లా 22 మండలాలు, 399 గ్రామ పంచాయతీలు, 769 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. 

అనారోగ్యం అంటూ జవాబు
గత ఎన్నికల్లో 399 పంచాయతీలకు, 4 వేల పైచిలుకు వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు వాల్‌పోస్టర్లు, వాహనాలు, బ్యానర్లు, ఇతర ప్రచారం కోసం వెచ్చించిన ఖర్చుల వివరాలు ఎన్నిక తంతు ముగియగానే సంబంధిత ఎన్నికల అధికారికి లేదా ఆ తర్వాత స్థానిక తహసీల్దార్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌కు అందచేయాలి. కానీ, జిల్లాలోని బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ్‌ ప్రాంతాలకు చెందిన అత్యధిక మంది, మిగిలిన ప్రాంతాల్లో కొందరు కలిపి 991 మంది వివరాలు అందచేయలేదు. దీంతో అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే, అనారోగ్యం కారణంగా షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇవ్వలేకపోయామని కొందరు జవాబు ఇచ్చారు. కాగా, నాలున్నర సంవత్సరాల వరకు అనారోగ్యంతో ఉన్నారా? అని ఎన్నికల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఆశావహుల్లో కలవరం
ఒకవైపు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే కనీస విద్యార్హత ఉండేలా చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందనే ప్రచారం.. మరోవైపు ఖర్చులు తెలియజేయకపోవడంతో షోకాజ్‌ నోటీసులు అందుకోవడంతో పలువురు ప్రజాప్రతినిధుల్లో కలవరం మొదలైంది. ఈ ఏడాది ఆగస్టు ఒకటవ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంది. అయితే, గడువుకు ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా ఎదిగినవారు.. అప్పుడు వార్డు సభ్యుల స్థాయి నుంచి రిజర్వేషన్‌ కలిసి వస్తే సర్పంచ్, ఇతర ప్రజాప్రతనిధులుగా పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఎన్నికల కమిషన్‌ అనర్హత కొరడా.. తీయడంతో తమ రాజకీయ భవితవ్యం ఎమవుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలోని మండలాలు    : 22
గ్రామ పంచాయతీలు    : 399
ఆవాస ప్రాంతాలు    : 769
వార్డులు     : 4,216
షోకాజ్‌ నోటీసులు అందుకున్నవారు    : 991
వారిలో ప్రజాప్రతినిధులుగా 
కొనసాగుతున్నవారు       : 176 

Advertisement
Advertisement