రెవె‘న్యూ’పాలన

land registration powers to mandal revenue officers - Sakshi

సబ్‌ రిజిస్ట్రార్ల పరిధి కుదింపు

తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్ల బాధ్యతలు

మార్చి 11 నుంచి కొత్త రూప్ఠు

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారాలకు త్వరలోనే కత్తెర పడనుంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ శాఖ పరిధి, అధికారాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నిర్వహిస్తున్న విధుల్లో ఎక్కువ భాగం పనులను రెవెన్యూశాఖకు బదలాయించాలని సంకల్పించింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో పాస్‌ పుస్తకాలను జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు నుంచి రెవె‘న్యూ’ పాలనకు తెరలేవనుంది. ఇప్పటి వరకు ప్రత్యేక విభాగంగా వ్యవహరించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆ రోజు నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధి తగ్గనుంది. ఇకపై ఎక్కడైతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉందో దాని పరిధి ఆ మండలానికే పరిమితం కానుంది. మిగతా చోట్ల తహసీల్దార్లే రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. భూముల క్రయ విక్రయాల బాధ్యతలను వారే చూస్తారు.  

సగం చోట్ల ఖాళీ!
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సగం మండలాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తహసీల్దార్లే పర్యవేక్షించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో 45 మండలాలకుగాను కేవలం 22 మంది సబ్‌రిజిస్ట్రార్లు మాత్రమే ఉన్నారు. దీంతో వీరు మినహా మిగతా మండలాల బాధ్యతలు తహసీల్లార్ద నెత్తిన పడనున్నాయి. వికారాబాద్‌ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరులో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఆఫీసులున్నాయి. దీంతో ఇవి ప్రతి రోజూ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతాయి. ఇకపై ఇవి కేవలం ఆయా నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం కానున్నాయి.

అయితే, అదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయంలో సగం ఇక్కడి నుంచే వస్తోంది. ప్రధాన ఆదాయార్జన శాఖగా చెప్పుకునే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూములు, స్థలాలు, ఇతర దస్తావేజుల నమోదుతో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా రాబడి లభిస్తోంది. రాజధాని పరిసరాల్లోనే ఉండడం, నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో స్థిరాస్తిరంగం బలంగా ఉంది. దీంతో ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు, అగ్రిమెంట్లు సహా ఇతరత్రా డాక్యుమెంట్ల నమోదులోనూ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉంది. తాజా నిర్ణయంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిని సంబంధిత మండలానికే పరిమితం చేసినా మిగతా మండలాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ల భారం తహసీల్దార్లను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు యాచారం, మంచాల, కందుకూరు, ఆమనగల్లు, కొత్తూరు, నందిగామ, మొయినాబాద్, కడ్తాల, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో తహసీల్దార్ల ఇతర పనులపై ప్రభావం పడనుంది. అదే సమయంలో భూ వివాదాలు కూడా ఎక్కువే కావడంతో ఈ కొత్త విధులు తమ మెడకు ఎక్కడ చిక్కుకుంటాయోననే ఆ మండలాల తహసీల్దార్లు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పట్టణ నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అధికంగా ఉన్నందున  వీటిని పునర్విభజించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సబ్‌ రిజిస్ట్రార్ల విధులను దాదాపుగా రెవెన్యూశాఖకు బదలాయిస్తుండడంతో జిల్లా రిజిస్ట్రార్‌ బాధ్యతలేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top