
గుడిమెట్ట చెరువులో ట్రెంచి తవ్వినా పంటల సాగు
గిద్దలూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణలతో కుంచించుకుపోతున్నాయి. ఆక్రమణలు అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలను సైతం లెక్కచేయకుండా అక్రమార్కులు తెగబడుతున్నారు. చెరువుల విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. చెరువుల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు దిగుతున్నారంటే అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఎంతమేర ఉన్నాయో ఇట్టే తెలుస్తోంది. వర్షాల ద్వారా వచ్చే అరకొర నీరు సైతం నిలబడేందుకు అవకాశం లేకుండా పోతోందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాగాణి భూమి అంటూ.. అదనపు పన్నులు వసూలు చేస్తున్న అధికారులు చెరువుల్లో ఆక్రమణలు తొలగించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలు ఇలా..
గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 75 మైక్రో ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటి కింద దాదాపు 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగు నీరందించేందుకు ఎలాంటి ప్రాజెక్టులు, కాలువలు లేని ప్రాంతంలో చెరువులే ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వర్షాలపై ఆధారపడి ఉన్న చెరువులకు వచ్చే నీరు నిలిచేందుకు వీల్లేకుండా ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి.
నీరు–చెట్టు నిధులు వృథా..
చెరువుల్లో ఆక్రమణలు తొలగించేందుకు ప్రభుత్వం నీరు–చెట్టు పథకం ద్వారా నిధులు కేటాయించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.3 కోట్ల నిధులు మంజూరు కాగా ఇందుకు రూ.2.50 కోట్లతో చెరువులకు పైభాగంలో ట్రెంచి ఏర్పాటు చేశారు. ట్రెంచి నిర్మాణ పనుల కోసం కొత్త, పాత టీడీపీ నాయకులు తమ వర్గానికే పనులివ్వాలంటూ పోటీ పడ్డారు. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లో జరుగుతున్న పనులను అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆపేయించారు. ఎలాగోలా పనులు చేపట్టినా ఆక్రమణలు మాత్రం ఆగలేదు. ఆక్రమణలు అడ్డుకునేందుకు ట్రెంచి నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులే ఆక్రమణలకు తెరలేపారు. మిగిలిన రైతులు సైతం చెరువులను ఇష్టారాజ్యంగా ఆక్రమించేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణదారులు చెరువులు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు.
వెన్నుదన్ను టీడీపీ నేతలే
చెరువుల్లో జరుగుతున్న ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేయడంతో అధికారులు ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది యడవల్లి చెరువులో ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడకు వెళ్లిన అధికారులను ప్రజాప్రతినిధులే అడ్డుకున్నారు. ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడికి దిగారు. రాచర్ల మండలం యడవల్లి చెరువులో 30 ఎకరాలు, పాలకవీడులో 20 ఎకరాలు, గుడిమెట్ట చెరువులో 75 ఎకరాలు, గిద్దలూరు మండలం దేవనగరం స్వామి చెరువులో 40 ఎకరాలు, వెల్లుపల్లె వద్ద ఆరు ఎకరాల్లో ఉన్న కుంట, ముండ్లపాడు చెరువులో 20 ఎకరాలలను ఆక్రమించారు. కొమరోలు మండలం దద్దవాడ చెరువులో 15 ఎకరాలు, కొమరోలు, రాజుపాలెం చెరువులో 20 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్నారు. అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లోని పలు చెరువుల్లోనూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చెరువుల ఆక్రమణలు అడ్డుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఆక్రమణల తొలగింపు వ్యవహారం తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఒకరికొకరు చెబుతున్నారు.