‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికే’ | YV Subba Reddy Slams Cm Chandrababu Naidu Over Veligonda Project | Sakshi
Sakshi News home page

Aug 28 2018 5:17 PM | Updated on Aug 28 2018 6:59 PM

YV Subba Reddy Slams Cm Chandrababu Naidu Over Veligonda Project - Sakshi

ప్రాజెక్టును సంక్రాంతిలోపును పూర్తి చేయడం కాదు.. ప్రజలే బాబు ఇంటికి పంపిస్తారు..

సాక్షి, ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు వల్ల కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వెలిగొండ టన్నెల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్‌ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కేవలం 30 శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కరువునుపారద్రోలుతానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను నివారించగలిగారా అని ప్రశ్నించారు. 

వెలిగొండ ప్రాజెక్టు వద్ద మట్టి పనులే మొదలు పెట్టలేదని, సంక్రాంతిలోగా ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. హెడ్‌ రెగ్యులేటర్‌ కంప్లీట్‌ కాకుండా ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. బాబు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే పాదయాత్ర చేశానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత చంద్రబాబును ప్రజలే ఇంటికి పంపిస్తారని తెలిపారు. కనిగిరి నుంచి వెలిగొండ టన్నెల్‌ వరకు వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర కొనసాగింది. 14 రోజుల పాటు సాగిన పాదయాత్రలో ఆయన మొత్తం 207 కిలోమీటర్లు నడిచారు. ముగింపు సభకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు పార్థసారథి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

చంద్రబాబు మోసకారి..
సొంత మామ దివంగత నేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పెద్ద మోసకారి అని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు మెజార్టీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడు ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని, వైఎస్సార్‌ ఉండి ఉంటే ఎప్పుడో వెలిగొండ పూర్తయ్యేదన్నారు. ప్రజలకు మేలు చేయాలని బాబుకే లేదని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటుతో బుద్ది చెప్పాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ఈ సందర్భంగా మేకపాటి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులను చంద్రబాబు అటకెక్కించారని సీనియర్‌ నేత బాలినేని విమర్శించారు. వైఎస్సార్‌ హయాంలోనే ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి పనిలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement