
మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ప. గో.జిల్లా: టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసిన దోపిడీ, రాక్షస పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజలు ఏ విధంగా లబ్ది పొందారో అంతకు మించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఉంటుందని అన్నారు.
నవరత్నాలు పథకంలో ఉన్న ప్రతి హామీ కూడా పేదలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు లాగా మోసపూరిత హామీలు కాదన్నారు. నాలుగు నెలల్లో రాబోయే ఎన్నికల గురించి మొత్తం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మీదకు తోసేసి ఇప్పుడు తన స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
రాష్ట్రంలో సర్వేల పేరుతో ప్రజల దగ్గరకు వెళ్లి వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడికి పాల్పనట్టుగా మిగతా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎంతటి దారుణానికైనా పాల్పడతారన్నారు. మనం అన్నిటికి సిద్ధంగా ఉండాలని వైవీ చెప్పారు.