సింహపురిలో ఫ్యాన్‌ జోరు

YSRCP is on swing in Simhapuri - Sakshi

2014లో మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం 

ప్రస్తుతం జిల్లాలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం 

వర్గవిభేదాలు, ప్రజావ్యతిరేకతతో అధికార పార్టీ సతమతం 

వెంటాడుతున్న అవినీతి, అక్రమాలు 

నిరంతరం ప్రజల్లోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు 

టీడీపీకి నెల్లూరు నగరం నుంచి నారాయణ, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి 

అధికార పార్టీకి ఇంకా దొరకని నెల్లూరు ఎంపీ అభ్యర్థి 

రాజకీయ ఉద్దండుల జిల్లా సింహపురి ఖిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీ జిల్లాలో ఉనికి చాటుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాలూ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో జిల్లాలో పూర్తిస్థాయి వాతావరణం వచ్చేసింది. 2014 ఎన్నికల్లో జిల్లా ఓటర్లు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టి, టీడీపీని మూడు స్థానాలకే పరిమితం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలనే నమ్ముకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందుకు సాగుతుండగా, అధికార దర్పంతో, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, తద్వారా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనడమే ఎజెండాగా టీడీపీ నేతలు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారు. ఇరు పార్టీలూ ఇప్పటికే బలాబలాలను బేరీజు వేసుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.  
– సాక్షి ప్రతినిధి, నెల్లూరు

రాజకీయ చరిత్ర  
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను అందించి రాష్ట్ర రాజకీయాలను అనేక సంవత్సరాల పాటు శాసించిన నేతలకు నెలవైన జిల్లాగా పేరుంది. రాజకీయంగా తొలి తరంలో బెజవాడ, ఆనం కుటుంబాలు జిల్లా రాజకీయాలపై బలమైన ముద్ర వేయగా, ఆ తరువాత ఆనం, నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఈ జిల్లా బడా కాంట్రాక్టర్లకు ఖ్యాతి గాంచింది. ఇక్కడి బడా కాంట్రాక్టర్లు కొందరు మన దేశంతో పాటు విదేశాల్లోనూ భారీ కాంట్రాక్ట్‌లు చేస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. జిల్లాలో నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ స్థానం 1962 నుంచి 2009 వరకు ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా కొనసాగింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో జనరల్‌ స్థానంగా మారింది. నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోకి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి , ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం వస్తాయి. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి.  

 ఈ సారి జిల్లాలో అధికార పార్టీ ఉనికిని బలంగా చాటుకోవడానికి కాంట్రాక్టర్లను, మంత్రులను రంగంలోకి దించింది. డబ్బుతో ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కటం మొదలు పెట్టింది. అయితే ప్రతిపక్ష పార్టీ ప్రజాబలం ముందు ఈ ప్రయత్నాలు ఏ మేరకు నిలుస్తాయో వేచి చూడాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాలకు, రెండు పార్లమెంట్‌ స్థానాలకు నెల్లూరు నగర మేయర్‌ పీఠానికి, నెల్లూరు జిల్లా పరిషత్‌ పీఠానికి...ఇలా జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీనే ఆదరించారు. జిల్లాలో ప్రస్తుతం అదే వాతావరణం కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేతలే కావడం గమనార్హం. నెల్లూరు నగరం నుంచి పి. అనిల్‌కుమార్‌ యాదవ్, నెల్లూరు రూరల్‌ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట నుంచి కిలివేటి సంజీవయ్య, గూడూరు నుంచి పాశం సునీల్‌కుమార్‌ గెలుపొందారు. వీరిలో పాశం సునీల్‌ కుమార్‌ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించారు. నెల్లూరు నగర మేయర్‌గా గెలుపొందిన అబ్దుల్‌ అజీజ్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా గెలుపొందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా అధికార పార్టీలోకి ఫిరాయించారు.  

హోరాహోరీ పోరు  
నెల్లూరు పట్టణ స్థానానికి జరుగుతోన్న ఎన్నికల పోరు రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌ యాదవ్‌పైకి అధికార పార్టీ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, ఎమ్మెల్సీ పి.నారాయణను పోటీకి దించింది. గత ఐదేళ్లుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, చిన్నపాటి సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ఉన్న ఎమ్మెల్యేగా అనిల్‌కు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎటువంటి అవినీతి ముద్ర లేని వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఇక మంత్రి నారాయణ గత రెండు నెలలు మినహా మిగిలిన 4 ఏళ్ల 8 నెలల కాలం కూడా నగర ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. జిల్లాలో మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాలపై సమగ్ర అవగాహన లేకపోవడం, మంత్రి అనుచరగణం నగరంలో అందినంత వరకు దోచుకోవడం, దానికి మంత్రి పూర్తిగా మద్దతు ఇస్తుండటంతో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ఇద్దరి మధ్య పోరు మాత్రం ఆసక్తిగా సాగే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  

నెల్లూరు రూరల్‌
బరిలో వైఎస్సార్‌సీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉండగా అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మమేకమయ్యారు. గత నాలుగన్నరేళ్ల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మూడు, నాలుగు సార్లు వెళ్లడం, నిరంతరం కార్యక్రమాలు చేస్తుండటంతో నగరంలోని, డివిజన్లతో పాటు రూరల్‌ గ్రామాల్లో పార్టీకి బలమైన పట్టు ఉండటం ఇక్కడ వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చే అంశం. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆయన గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన ఎంపీగా కాకుండా, ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. అయితే పార్టీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డితో ఆదాలకు సుదీర్ఘకాలంగా వర్గపోరు ఉండడం, రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌ బలంగా లేకపోవడం ఆయనకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అయితే ఇద్దరి మధ్య పోరు ఆసక్తిగా సాగే అవకాశం ఉంది.  

సర్వేపల్లి   
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కాకాణి గోవర్థనరెడ్డి బరిలో ఉన్నారు. గతంలో జెడ్పీ చైర్మన్‌గా ఉన్న అనుభవం, సొంత ప్రాంతమే నియోజకవర్గం కావడంతో పాటు ఇక్కడ పార్టీ బలంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ క్రియాశీలక రాజకీయాలు సాగిస్తున్నారు. ఇక 2014లో ఓడిపోయి ప్రస్తుతం వ్యవసాయశాఖా మంత్రిగా ఉన్న సోమిరెడ్డి్డ మళ్లీ ఇక్కడ బరిలో నిలిచారు. ఆయన నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను పూర్తిగా విస్మరించారనే అపవాదు ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో పనులు, పర్సంటేజ్‌లతో పాటు అవినీతి వరద పారడం ఇబ్బందికరంగా మారింది. 
 
కోవూరు  
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి, టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి పోటీ జరగబోతోంది. నల్లపరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉండడం, దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన కుటుంబానికి చెందిన నేత కావడం, నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం ప్రసన్న కుమార్‌కు కలిసొచ్చే అంశాలు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించటంతో పాటు పార్టీ ఎంపీల నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేత కావడంతో పాత టీడీపీ నేతలతో నిరంతరం విభేదాల కుంపటి కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు అవినీతి కూడా తారస్థాయిలో ఉండడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.  
 
కావలి  
వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిపై టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సభ్యుడు బీద మస్తానరావు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీకి అన్ని మండలాల్లో బలమైన క్యాడర్‌ ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యేకి వివాదరహితుడిగా పేరుండడం కలిసొచ్చే అంశం. ఇక టీడీపీ అభ్యర్థి బీద మస్తానరావు రొయ్యల ఎగుమతి వ్యాపారంతో పాటు పలు వ్యాపారాల నిర్వహణలో ఉన్నారు. ఆయన సోదరుడు రవిచంద్ర నియోజకవర్గంలో పెత్తనం సాగించారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ పనులు మొదలుకొని ప్రతి పనిలో భారీగా అవినీతి, భూఆక్రమణల వ్యవçహారాలు వారికి తలనొప్పిగా మారాయి. 

ఉదయగిరి  
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డికి, టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి పోటీ ఉంది. నియోజకవర్గంలోని 8 మండలాల్లో వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉండటం, చంద్రశేఖర రెడ్డి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పని చేసి ఉండటం కలిసొచ్చే అంశం. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని రామారావు బడా కాంట్రాక్టర్‌గా ఉండడం, స్థానికంగా పార్టీ క్యాడర్‌కు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, మçహారాష్ట్రలోని విదర్భలో కాంట్రాక్టు పనులకు సంబంధించి కేసులు, స్థానికంగా టీడీపీ నేతలకు సైతం బకాయిలు ఉండడం తదితర అంశాలు టీడీపీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం బలంగా సాగుతుండడంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. 

ఆత్మకూరు   
సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మేకపాటి తనయుడు గౌతమ్‌ రెడ్డి 2014లో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో పార్టీకి మంచిపట్టు ఉంది. దీనికి తోడు మేకపాటి కుటుంబానికి కూడా మంచి పేరు ఉండడం కలిసొచ్చే అంశం. రెండు నెలల క్రితం వరకు కూడా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ లేకపోవడంతో తీవ్ర గందరగోళ వాతావరణం కొనసాగింది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం టిక్కెట్‌ ఆశించి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అయితే ఆయనకు స్థానికంగా అందుబాటులో ఉండకపోవటం ఇబ్బందికరంగా ఉంది.  

వెంకటగిరి  
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఢీకొట్టనున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉండడం, జిల్లాలో ఆనం కుటుంబానికి రాజకీయంగా బలమైన వర్గంతో పాటు మంచి పేరు కూడా ఉండడం, ఆనం గతంలో ప్రాతినిధ్యం వహించిన రాపూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు వెంకటగిరిలో ఉండడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశాలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామకృష్ణ రెండు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న విమర్శ బలంగా ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే పెచ్చుమీరిన అవినీతి, నియోజకవర్గంలోని రెండు ప్రధాన కులాల్ని విస్మరించటం, ఆక్రమ రవాణా తదితర అంశాలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాయి.  

గూడూరు ఎస్సీ    
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ప్రస్తుతం మేరిగ మురళి ఉన్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, టీడీపీలోకి ఫిరాయించిన పాశం సునీల్‌ కుమార్‌ ప్రస్తుతం అధికార పార్టీ తరుపున బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీకి బలమైన క్యాడర్‌ ఉంది. అలాగే ఇక్కడ బలమైన రాజకీయ కుటుంబాల వ్యక్తులు పార్టీ నేతలుగా ఉండటం పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పాశం అవినీతి, నియోజకవర్గంలో భూఆక్రమణలు, పాత టీడీపీ నేతలతో నిరంతర విభేదాలతో సతమతమవుతున్నారు.  
 
సూళ్లూరుపేట ఎస్సీ  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్‌తో పాటు వైఎస్సార్‌ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వివాదరహిత ఎమ్మెల్యేగా, నిరంతరం ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి పరసా రత్నం టీడీపీ నేతల అవినీతి, భూ ఆక్రమణలు, తారాస్థాయిలో కొనసాగుతున్న వర్గవిభేదాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలాగే రత్నంను మార్చాలని క్యాడర్‌ తీవ్రంగా ఆందోళన చేయడంతో ఆయన అభ్యర్థిత్వం పెండింగ్‌లో ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top