
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనపై పవన్ స్పందించిన తీరును తనదైన శైలిలో ఖండించారు. ‘రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?’ అని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్ స్పందిస్తూ.. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పేర్కొన్నారు. అత్యంత కిరాతకంగా, అమానుషంగా షాద్‌నగర్ శివార్లలో దిశను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబుక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.