అంజాద్‌బాషాకు అగ్రపీఠం..!

YSRCP Leader Amjad Basha Profile - Sakshi

వైఎస్సార్‌సీపీలో అంచెలంచెలుగా ఎదిగిన మైనార్టీ నేత

డిప్యూటీ సీఎం హోదా దక్కనున్న నేపథ్యం

నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్‌

సాక్షి ప్రతినిధి కడప: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యే ఎస్‌బీ అంజాద్‌బాషాకు అవకాశం దక్కింది. డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టి ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్‌ నరసింహన్‌ మంత్రిగా పమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు తరలివెళ్లారు. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజాద్‌బాషా 2005లో రాజకీయ అరంగ్రేటం చేశారు. కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్‌ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్‌సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై పార్టీ ఉన్నతికి కృషి చేశారు. 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. ఆపై నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాలల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆపై వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమీటీ మెంబర్‌గా అంజాద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసినా ఆయన మరోమారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక మంత్రి పదవి వరించింది. నూతన మంత్రి వర్గం ఎంపికతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ దార్శనికతకు చిరునామా నిలిచారు.

కడప నియోజకవర్గానికి మరో అవకాశం....
కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజాద్‌బాషా చేరారు. ఎస్‌ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్‌ ఎస్‌ఏ ఖలీల్‌భాషా(1999), ఎస్‌ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో ఎస్‌బీ అంజాద్‌బాషాకు ఆ హోదా దక్కింది.

విధేయత...విశ్వాసం...సమర్థత...
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎస్‌బి అంజాద్‌బాషాకు మంత్రి పదవి వరించడం వెనుక వైఎస్సార్‌సీపీ పట్ల అత్యంత విధేయత, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లిం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్‌బి గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్‌ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైగా సామాజిక సమతుల్యత కూడా అత్యంత ప్రధానంగా నిలవడంతో అంజాద్‌బాషాను డిప్యూటీ సీఎం హోదా వరిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

కుటుంబ నేపథ్యం: కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్‌ ఎస్‌బి హరూన్‌ సాహెబ్‌ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచిగా పనిచేశారు. సిద్దవటంలో హరూన్‌ సాహెబ్‌ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన్ను బహదూర్‌ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్‌ సాహెబ్‌ కుమారుడైన అబ్దుల్‌ ఖాదర్‌ అలియాస్‌ జైలు పెద్ద కుమారుడే ఎస్‌బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు.కడప, కర్నూల్, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్‌ జోసెఫ్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్‌ తరుపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు.

చేపట్టిన పదవులు:  అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌గా, బుఖారియా విద్యాసంస్థ ఉపా««ధ్యక్షుడిగా, అల్‌ హజ్‌ ఎస్‌బి అబ్దుల్‌ ఖాదర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి, హరూన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్‌ అల్యూమిని అసోషియేట్‌లకు అ««ధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్‌ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్‌ఆర్‌టీసీలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో కడప సమన్వయకర్త. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ తరుపున పోటీ చేసి 45వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు. 2018లో వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రెటరీ, 2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్‌. సావరత్రిక ఎన్నికల్లో 54వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

నాపైన ఉంచిననమ్మకానికి కృతజ్ఞతలు
అన్ని వర్గాల వారికి కేబినెట్‌లో చోటు దక్కింది. అసలైన సామాజిక న్యాయం అంటే ఏమిటో మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారు. ఆయన కేబినెట్‌లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నామీద నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన వైఎస్‌ జగన్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. నాకు అప్పగించిన బా«ధ్యతలను సక్రమంగా నెరవేర్చి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తాను. నాకు అండగా నిలబడిన కడప నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటాను.– ఎస్‌బీ అంజాద్‌బాషా

బయోడేటా
పేరు: షేక్‌ బెపారి అంజద్‌బాషా
పుట్టిన తేది: 12.08.1971
తండ్రి పేరు: అబ్దుల్‌ ఖాదర్‌ షేక్‌ బెపారి
తల్లి పేరు: నూర్జహాన్‌ బేగం షేక్‌ బెపారి
భార్య పేరు: నౌరిన్‌ ఫాతిమా షేక్‌ బెపారి
కుమార్తె పేరు: జైబా జువేరియా
విద్యార్హత: బీఏ
రాజకీయ ప్రవేశం: 2005లో
అనుభవం: 2005లో కార్పొరేటర్, 2014, 2019లో
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
వ్యాపారాలు: హరూన్‌ బజాజ్‌ షోరూమ్స్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top