ప్రతి ఎకరాకునీరు అందిస్తాం

Deputy CM Amjad Basha Speech At YSR Kadapa - Sakshi

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద నుంచి కేసీ కెనాల్‌ 

సాక్షి, వల్లూరు: జిల్లాలోని ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందించడమే ధ్యేయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు చేరుకున్నారు. కృష్ణా జలాలను కమలాపురం శాసన సభ్యుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలతో కలిసి డిప్యూటీ సీఎం గేట్లను ఎత్తి కేసీ కెనాల్‌ పరిధిలోని ఆయకట్టు చెరువులకు వదిలారు. మొదట కొబ్బరి కాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తుంగభధ్ర నది నీటిపై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో పూర్తిగా కృష్ణా జలాలే జిల్లాకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రాయలసీమకు కృష్ణా జలాలను అందించడానికి వీలుగా నాడు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించడానికి గోదావరి , కృష్ణానదుల అనుసంధానం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్, మన సీఎం జగన్‌ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. తండ్రి బాటలోనే జగన్‌ కూడా రాయల సీమకు నీటిని అందించి న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద 2500 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 100 క్యూసెక్కులను కేసీ కాలువ ద్వారా చెరువులకు వదిలినట్లు వివరించారు.

త్వరలో ఐఏబీ (ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు ) సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో49 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ దేవుడి దయ వల్ల మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి చేరిన నీటిని వదలడం వల్ల ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు చేరిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఐఏబీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీ కెనాల్‌ రైతులందరికీ పంటల సాగుపై భరోసా కల్పించాలని కోరారు. కృష్ణా ,గోదావరి నదుల అనుసంధానం చేస్తేనే రాయలసీమ ప్రాంత వాసులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాయలసీమలోని భూములకు శాశ్వతంగా సాగు నీరు అందించాలంటే గోదావరి నీటితో శ్రీశైలం జలాశయాన్ని నింపుకోవడం ఎంతైనా అవసరమని , ఈ దిశగా సీఎం జగన్, తెలంగాణ సీఎంల మధ్య సంప్రదింపులు సాగుతున్నాయని పేర్కొన్నారు. 

టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతా..
పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆదినిమ్మాయపల్లె ఆనకట్టను, పక్కనే ఉన్న పుష్పగిరి క్షేత్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు. ఆదినిమ్మాయపల్లె ఆనకట్టను ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌గా తీర్చిదిద్దితే ఈ ప్రాంత ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై శాసనసభ్యులు రవీంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రసావించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ,కేసీ కెనాల్‌ ఈఈ బాల చంద్రారెడ్డి, డిఈ బ్రంహారెడ్డి, ఇరిగేషన్‌ డీఈ జిలానీ బాషా , వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఇందిరెడ్డి శంకర్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, గుమ్మా రాజేంద్రారెడ్డి, ఆర్‌వీఎస్‌ఆర్, జీఎన్‌ భాస్కర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, నాగ సుబ్బారెడ్డి, పులి సునీల్‌ కుమార్, చీర్ల సురేష్‌ యాదవ్, ప్రతాప్‌రెడ్డి, రాఘవరెడ్డి, నాగిరెడ్డి, పిచ్చిరెడ్డి, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top