సిగ్గూశరం ఉంటే ఇప్పటికైనా స్పందించాలి

YSRCP leadar sajjala ramakrishna reddy comments over mps hunger strike - Sakshi

మాట తప్పిన ప్రధాని అని అనిపించుకుంటారా?

జనంలోకి పోవడానికి టీడీపీ భయపడుతోంది

కాంగ్రెస్‌ ఎప్పుడో చచ్చిపోయింది..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: జనంలోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భయపడుతోందని, బీజేపీకి సిగ్గూశరం ఉంటే ఇప్పటికైనా స్పందించాలని, మాట తప్పిన ప్రధాని అని అనిపించుకోకూడదునుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం మధ్యాహ్నం ఎంపీల దీక్షా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం నుంచే పరిస్థితి దిగజారుతోంది. కళ్లు తిరగడం, తలనొప్పి, శరీరం సహకరించకపోవడం జరిగింది. యువకులు కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన మార్గమని చెప్పారు. స్వచ్ఛందంగా వాళ్లే రాజీనామాలతో పాటు దీక్షకు కూర్చుంటామని అధ్యక్షుడిని అడిగారు. అప్పుడు మా అధ్యక్షుడు ఇది ఒక్కరోజులో తెగేది కాదు.. పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది.. ఎక్స్‌ట్రీమ్‌ స్టెప్‌ అవసరమా అని జగన్‌ అన్నారు. అయినప్పటికీ వాళ్లు కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో దీక్షకు దిగుతామంటే జగన్‌ సరేనన్నారు.

చరిత్రలో తొలిసారిగా ఎంపీలు ఇలా రాజీనామా చేసి ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కదలిక లేకుండా.. పూర్తిగా మొండివైఖరితో ఉంది. పరిశీలిస్తామని గానీ, వారి దూతలను పంపడం గానీ జరగలేదు. మా ఎంపీలు జనం తరపున పోరాడుతున్నారు. ఈ ఆందోళన జనంలోకి వెళ్లింది. అక్కడ కూడా వీరికి మద్దతుగా నిరంతర పోరాటం సాగుతోంది. రహదారుల నిర్బంధం, రైల్‌రోకో జరుగుతోంది. ప్రజా ఉద్యమంగా మారడంలో ఎంపీలు కీలకంగా మారారు. మరోవైపు వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. యువకులు కాబట్టి తట్టుకున్నప్పటికీ ఆరోగ్యం మరింత విషమిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. ఆ మేరకు డాక్టర్లు పోలీసులకు సలహా ఇచ్చారు. ఎంపీలు ఇంకా జనం కోసం పోరాడాల్సి ఉంది. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

కేంద్రం స్పందించలేకపోవడంపై..
‘బహుశా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. అత్యున్నత వేదిక, ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటులో చేసిన చట్టానికి విలువ లేదు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అన్ని పక్షాల మద్దతుతో వెలువడిన ప్రధాని ప్రకటనకు విలువ లేదు. వీటిలో భాగస్వాములైన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, అందులో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచేశారు. కాంగ్రెస్‌ ఎలాగూ శవం. రాష్ట్రంలో చచ్చిపోయింది. టీడీపీ, బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అమలు చేయాల్సిన బాధ్యత పెట్టుకుని ఇప్పుడు మాకేం సంబంధం అంటూ పక్కకు పడేశారు. ఎన్నికలొస్తున్నాయని చివరి నిమిషంలో యూటర్న్‌ తీసుకున్నప్పటికీ జనంలోకి పోవడానికి టీడీపీ భయపడుతోంది. ఇప్పటికే తన బస్సు యాత్రను నిలిపివేసింది. ఇక బీజేపీకి ఇప్పటికైనా హోదా ప్రకటించి ప్రజల మన్నన పొందేందుకు ఆస్కారం ఉంది.

ఏమాత్రం వారికి సిగ్గూశరం ఉన్నా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకున్నా, దేశమంతా దీన్ని చర్చించుకుంటున్నందున మాట తప్పిన ప్రధానిగా, మాట తప్పిన ప్రభుత్వంగా అనిపించుకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా వాళ్లకు అవకాశం ఉంది. కానీ సానుకూలత కనిపించడం లేదు. జనంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టి ఏడేళ్లయినా అందులో నాలుగేళ్లుగా పోరాటంలోనే ఉంది. హోదా అంటే ఏంటో జనంలో చైతన్యం తెచ్చింది. హోదా లేనిపక్షంలో భవిష్యత్తు లేదని వివరించింది. సెంటిమెంటుగా మార్చగలిగింది. అది జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి ఫలితం. ఎంపీల రాజీనామా, దీక్షతో ఇది మరింత తీవ్రమైన స్థాయికి వెళ్లింది. ప్రజలంతా కదిలివస్తున్నారు. అందుకే ప్రజా ఉద్యమంగా మారింది. కేవలం మా కార్యకర్తలు వస్తే రోడ్లు కొద్దిసేపు మాత్రమే ఆపగలం. కానీ ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఈ ఉద్యమంతో ఉన్నారు. ఇదే ప్రాతిపదికన రేపు ప్రజాతీర్పు కోరుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top