విలువలు, విశ్వసనీయత..బైబై బాబు!

YS Vijayamma YS Sharmila Plays Key Role In YSRCP Mass Voctory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి’ అంటూ వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అక్షరాలా నిజం చేసి చూపించారు. మహానేత వైఎస్సార్‌ను కోల్పోయినప్పటికీ... తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని చెప్పినా ఆ మాతృమూర్తి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. భర్తను కోల్పోయినప్పటికీ... రాజకీయ ప్రత్యర్థులు కుమారుడిని నెలల పాటు జైళ్లో ఉంచినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కుటుంబాన్ని, పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ జననేత జగన్‌తో పాటు ఆమె కూడా వారికి అండగా నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజారంజక పాలన అందించేందుకు వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేసిన తనయుడికి మద్దతుగా..ఎండల్ని సైతం లెక్కచేయక సుడిగాలి ప్రచారం నిర్వహించారు. 27 సభల్లో తనదైన శైలిలో ప్రచారం సాగించి చంద్రబాబు పాలనను ఎండగట్టారు.

అదే దరహాసం.. తరగని విశ్వాసం
ఓ పక్క హామీలను గాలొకొదిలేసి ప్రజలను వంచించిన అధికార పార్టీని విమర్శిస్తూనే.. మరోపక్క తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పాలన అందిస్తారోనన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారు. వైఎస్సార్‌ పాలనను గుర్తు చేస్తూ.. రాజన్న తనయుడికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్వేగపూరితంగా ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించాయి. ప్రజలకిచ్చిన మాటకోసమే జగన్‌.. సోనియాను ఎదిరించి మరీ ఓదార్పు యాత్ర చేశారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో జగన్‌ పట్ల ఆదరణ పెరిగిపోవడంతో తట్టుకోలేని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి.. ఆస్తులు అటాచ్‌ చేశారని, చివరకు విచారణ పేరుతో పిలిచి జైల్లో పెట్టారంటూ జరిగిన సంఘటనలను సవివరంగా తెలియజేస్తూ, తను ఎందుకు బయటకు రావాల్సి వచ్చినదీ వివరించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఆనాడు తమ కుటుంబం వెంట నిలిచిన ప్రజలకోసం తాను, షర్మిల బయటకు వచ్చామని, ఈరోజు కూడా ప్రజలంతా తమ కుటుంబమనుకునే బయటకు వచ్చామన్న ఆమె మాటలు జనం గుండెలను తాకాయి. ఈ విధంగా వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారు.

ఆలోచింపజేసిన విజయమ్మ మాటలు
- రాజశేఖరరెడ్డి గారిలా జగన్‌ మాట ఇస్తే తప్పడు. వాళ్ల నాన్న మాదిరి పరిపాలన అందిస్తాడు.
- జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.  
- ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి.
- జగన్‌ సోనియా గాంధీనే ఎదిరించి నిలిచినవాడు.. ఈరోజు కేసులకు భయపడతాడా? ఓటమి భయంతో చంద్రబాబు ఇష్టానురీతిన దుష్ప్రచారం చేస్తున్నారు.

అన్న బాణం.. దూసుకెళ్లిన షర్మిల..
వైఎస్సార్‌ తనయ, జగన్‌ సోదరి షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న జైలులో ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఆమె.. ప్రస్తుత ఎన్నికల్లో 39 సభల్లో పాల్గొని ప్రచారంలోనూ ప్రజలను ఉర్రూతలూగించారు. ‘మాకు ఎవ్వరితోనూ పొత్తుల్లేవు. సింహం సింగిల్‌గానే వస్తుంది.. నక్కలే గుంపులుగా వస్తాయి’  అంటూ ప్రచారం సాగించిన షర్మిల తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఎన్నికల ముంగిట పసుపు- కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీలకు కూడా సరిపోవని వివరించిన తీరు మహిళలను ఆలోచింపజేశాయి. చంద్రబాబు ఏవిధంగా అబద్ధాలు చెబుతున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసగించారో ఆమె సూటిగా వివరిస్తూ.. విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించిన తీరును కళ్లకు కట్టారు.

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ఆమె ప్రజల ముందుంచారు. సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు లోకేశ్‌ వ్యవహార శైలిని ఆమె తూర్పార పట్టిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతలో ఒక్కరికైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తూ జనం నుంచే లేదంటూ చెప్పించారు. వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న అవాస్తవ పొత్తుల ఆరోపణలను షర్మిల తిప్పికొట్టారు. హరికృష్ణ శవాన్ని ముందు పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పొత్తుల కోసం బేరాలాడిన నువ్వా పౌరుషం గురించి మాట్లాడేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. చివరగా ప్రజా తీర్పు బై బై బాబు కావాలంటూ షర్మిల చెప్పగా ఆయా సభలకు హాజరైన ప్రజానీకం ఆమెతో గొంతు కలపడం విశేషం.

ఇక మొత్తంగా వైఎస్‌ విజయమ్మ, షర్మిల కలిసి 66 సభల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొత్తం 20 రోజుల పర్యటనలో వైఎస్‌ విజయమ్మ 27, షర్మిల 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ 9 జిల్లాల పరిధిలోనూ, షర్మిల 6 జిల్లాల పరిధిలోనూ పర్యటించి జననేత విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ప్రజలను ఆకట్టుకున్న షర్మిలమ్మ మాటలు
- బాబు వస్తే జాబు రాలేదు కానీ కరువు వచ్చింది.
- రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు లేవు కానీ ఎటువంటి అనుభవం లేని సీఎం తనయుడు లోకేశ్‌కు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఏకంగా మూడు ఉద్యోగాలు (మంత్రి పదవులు) దక్కాయి.
- ప్రజా తీర్పు.. బై బై బాబు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top