భూములు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌

YS Jagan Slams Ganta Srinivasa Rao At Anandapuram Public Meeting - Sakshi

భీమిలిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు

హుద్‌ హుద్‌ తుఫాన్‌ పేరుతో భూరికార్డులు మాయం

చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీ నిర్వీర్యమైంది

ఆనందపురం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం : భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చంద్రబాబు నాయుడి పాలనపై మండిపడ్డారు. 264వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇంకా ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు..
‘భీమిలిలో తిరుగుతున్నప్పుడు ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు.. బాబుగారు పాలన చేపట్టి నాలుగున్నరేళ్లయినా ఒక్క పనిచేపట్టలేదన్నా. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ భూములను దోచేస్తున్నారు.  ప్రభుత్వ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు కనిపిస్తలేవన్నా.. ఎక్కడైనా కనిపిస్తే మాయం చేస్తున్నారన్నా.. అని చెబుతున్నారు. మా మంత్రి గంటా శ్రీనివాస రావు, సీఎం చంద్రబాబు ట్రైనింగ్‌లో ఆరితేరిపోయాడు. ఎన్నికలు వచ్చేప్పటికి దొంగల ముఠా స్థావరాలు మార్చినట్లు ఆయన తన నియోజకవర్గాలను మారుస్తాడన్నా అని అంటున్నారు. భీమిలీ, ఆనందపురం, మధురవాడ తహసీల్దార్‌ ఆఫీసుల్లో జరగిన అవినీతిపై సీట్‌ ముందు ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి గంటా అండదండలతో ఎమ్మార్వోలు అన్యాయాలు చేస్తున్నారు. హుద్‌ హుద్‌ తుఫాను పేరుతో రికార్డులను మాయం చేశారు. తుఫాన్‌ కారణం చూపించి ఎమ్మార్వో ఆఫీసుల్లో ఎఫ్‌ఎంబీలు, ఆర్‌ఎంబీలు, మ్యాపులు మాయమైపోయ్యాయని చెప్పి రికార్డులను తారుమారు చేసి భూములను దోచుకుంటున్నారు. పేదలను భయపెట్టి అసైన్డ్‌ భూములను కొంటారు. తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో దందా చేస్తారు.

విద్యాశాఖ గురించి మాట్లాడితే..
మంత్రి గంటా వియ్యంకుడు నారాయణ. ఆయన విద్యాసంస్థల్లో ఫీజులు బాదుడే బాదుడు. పెంచడానికి మంత్రి గంటా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు.  ఇదే నారయణ కాలేజీల్లో సుమారు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాలేజీలు మూసేయించాల్సిన మంత్రి మౌనం వహిస్తారు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి నారయణ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్ట్‌లను భర్తీ చేయకుండా నిర్వీర్యం చేసి చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్‌ మూర్తి గీతం యూనివర్సిటీకి వెళ్లేలా ప్రోత్సహిస్తారు.

కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు..
చిట్టివలస జ్యూట్‌ మిల్లులో 6 వేల మంది పనిచేసేవారు. ఎన్నికలకు ముందు మంత్రి గంటా నెలరోజుల్లో ఈ మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఇంత వరకు ఆ జ్యూట్‌ మిల్లు తెరుచుకోలేదు. కార్మికులకు రూ.119 కోట్లు బకాయి పడ్డారు. ఈ జ్యూట్ మిల్లుకు ఉన్న రెండెకరాల గోడౌన్‌ స్థలాన్ని వేరే వ్యక్తుల చేత కొనుగోలు చేయించారు. ఆ సొమ్ము అన్నా కార్మికులకు ఇచ్చారా అంటే.. అది లేదు. ఆ డబ్బులతో వ్యాపారం చేస్తారు. విశాఖ సమ్మిట్‌ పేరిట మూడు రోజులు తినడానికే రూ. 53 కోట్లు ఖర్చు పెట్టారు. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. వచ్చాయా అని అడుగుతున్నా?(లేదు..లేదు అని ప్రజల నుంచి సమాధానం) ఉత్తరాంధ్రలో 35 జ్యూట్‌ మిల్లులు ఉంటే దాదాపు 50 వేల మందికి ఉపాధి కలుగుతోంది.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 18 జ్యూట్‌ మిల్లులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఏకంగా 30 వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కరెంట్‌ యూనిట్‌కు రూ. 3.15 పైసలు ఉండేది. ఈ పెద్దమనిషి వచ్చిన తరువాత అదే యూనిట్‌ ధరను రూ. 8.40 రూపాయలకు పెంచారు. ఇలా పెంచితే జ్యూట్‌ మిల్లులు మూతపడక ఏం చేస్తాయని చంద్రబాబు అని అడుగుతున్నా.? చెక్కర ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగలు ఊడిపోతుంటే ఈ పెద్దమనిషికి చీమకుట్టినట్లు కూడా లేదు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఆ శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా తీసేశారు. ఎందుకంటే మీ మంత్రి గంటా భీమిలీ నుంచి పోటీ చేయడు. అందుకే ఆ శంకుస్థాపనను కూడా తీసుకెళ్లారు.

ఆరోగ్య శ్రీ అటకెక్కింది..
పోలవరం పనులను చూస్తే పునాది గోడలు దాటవు. చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యులతో గ్యాలరీ వాక్‌ చేస్తారు. పునాదులు వేసి గృహ ప్రవేశానికి పిలిస్తే పిచ్చోడంటారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలతో కొత్త డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీ నిర్వీర్యమైంది. ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతి పేదవాడికి చికిత్స రూ. వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తాం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం. ఆపరేషన్‌ చేశాక విశ్రాంతి సమయంలో పేషెంట్‌కు ఆర్థికసాయం అందిస్తాం. మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీ మనస్సాక్షికి తగ్గట్లు ఓటేయండి. అధికారంలోకి వస్తే నవరత్నాలతో అన్ని వర్గాలను ఆదుకుంటాను.’  అని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top