
సాక్షి, హసనాపురం: కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు రోజులవుతున్నా ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా ముందుకు రాలేదని, రోజూ గంటలు గంటలు మీడియాతో మాట్లాడి.. ప్రజలకు బోర్ కొట్టించే చంద్రబాబు ఇప్పుడెందుకు మీడియా ముందుకు రావడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బాబు మీడియా ముందుకు రాకుండా.. తన అనుకూల మీడియాతో లీకులు ఇప్పిస్తున్నాడని, బడ్జెట్‌పై చంద్రబాబు చిటపటలాడుతున్నారని ఆయన అనుకూల మీడియా ఊదరగొడుతోందని, బాబు తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హసనాపురంలో వైఎస్ జగన్ ముస్లింలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో చంద్రబాబు పార్టీకి చెందిన ఎంపీలే మంత్రులుగా ఉన్నారని, వాళ్లంతా ఆమోదించిన తర్వాతే బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడతారని వైఎస్ జగన్ గుర్తుచేశారు.
ఈ క్రమంలో నిజంగా చంద్రబాబుకు తెలియకుండానే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారా? అని నిలదీశారు. నిజానికి ఇది ఐదో కేంద్ర బడ్జెట్ అని, చంద్రబాబు పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ఆమోదించిన తర్వాతే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని మరోసారి స్పష్టం చేశారు. తన తప్పులు, వైఫల్యాలకు కేంద్రం మీద నెపం నెట్టేందుకే బాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు విశ్వసనీయత, విలువలేని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ హవా ఎక్కువగా ఉన్నప్పుడు బాబు మైనారిటీలను విస్మరిస్తారని, అదే మోదీ హవా డౌన్ కాగానే.. ఆయనకు మైనారిటీలు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సంజీవిని అనీ, పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని పేర్కొన్న బాబు.. ఇప్పుడు హోదా ఏమైనా సంజీవినా అనీ రివర్స్ ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విలువలు రావాల్సిన అవసరముందని, రాజకీయాల్లో నిజంగా మార్పు రావాల్సిన అవసరముందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే సిన్సీయారిటీ, నిజాయితీ, విశ్వసనీయత ఉండాలని అన్నారు.
ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
- చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి.. ప్రతి ఒక్కరినీ మోసం చేశాడు
- బాబు మ్యానిఫెస్టో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వెతికినా దొరకదు
- ఎందుకంటే మ్యానిఫెస్టోలోని ప్రతి పేజీలో ఒక మోసం తెలుస్తోంది
- మ్యానిఫెస్టోను ప్రజలు చూస్తే.. బాబును కొడతారేమోనన్న భయంతోతో దానిని ఆన్‌లైన్‌లో కనబడకుండా చేశారు
- ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతే.. నాయకుడు రాజీనామా చేసి దిగిపోవాలి
- అప్పుడే చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత వస్తుంది
- రాజకీయాల్లో సిన్సియారిటీ, నిజాయితీ, విశ్వసయనీత లేకపోతే.. అప్పుడు అచ్చం ఏపీ రాజకీయాల్లో దిగజారిపోతాయి
- అప్పుడు రాజకీయ నాయకుడు అచ్చం చంద్రబాబులా దిగజారిపోతారు
- కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన సొంత మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది
మైనారిటీలను మోసం చేశారు..
- అధికారంలోకి వస్తే.. మైనారిటీలకు ఏం చేస్తానో చెప్తూ చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టారు
- నిరుద్యోగ ముస్లిం యువతకు ఐదు లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని అందిస్తానని చెప్పారు
- పేద, మధ్య తరగతి ముస్లింలకు లక్ష వరకు వడ్డీలేని రుణాన్ని 50శాతం సబ్సిడీతో బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఇస్తామని ఊదరగొట్టారు
- వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానంతో ముస్లింలకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని పేర్కొన్నారు
- ముస్లిం బాలికలకు, పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు
- వీటిలో ఏ ఒక్క హామీ అయిన అమలైందా? ఏ ఒక్కరికైనా వడ్డీలేని రుణాలు వచ్చాయా?
- ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం అమలైందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించగా.. లేదు..లేదు అంటూ సభలోని ప్రజలు ప్రతిధ్వనించారు