కేంద్రం హోదా ఇచ్చేలా జోక్యం చేసుకోండి!

YS Jagan letter to the President Ramnath Kovind - Sakshi

     రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లేఖ

     ఆ హామీపై బీజేపీ, టీడీపీలు నీళ్లు జల్లాయి

     ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం స్పందించడం లేదు

     చివరకు మా ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేపట్టారు

     పేరుకుపోయిన అప్పులతో రాష్ట్రం మనుగడ ఎలా?

     హోదా లేకపోతే ఏపీ అభివృద్ధి చెందదు

     ప్రత్యేక హోదాను ఏ కమిషన్‌ నిరాకరించలేదు

     పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా జోక్యం చేసుకోవాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని మరింత తీవ్రంగా నిర్లక్ష్యం చేశారన్నారు. 2014 ఎన్నికలకు ముందు తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ చెప్పారని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే 15ఏళ్లు కావాలని అడిగిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ ఆ లేఖలో గుర్తుచేశారు. హోదావల్ల లభించే ప్రోత్సాహకాలు లేకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రస్తావించారు. హోదా మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటవైపు తీసుకెళ్లగలదని స్పష్టంచేశారు. ఈ లేఖను ఆ పార్టీ ఎంపీలు మంగళవారం ఇక్కడ రాష్ట్రపతిని కలిసి ఆయనకు అందజేశారు. లేఖలో వైఎస్‌ జగన్‌ ప్రస్తావించిన అంశాలు..

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను అనాగరికంగా తొక్కిపెట్టి బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014ను ఆమోదించిన సందర్భాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తుచేయాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో విభజించారు. విభజనపై భిన్నాభిప్రాయాలను బయటకు పొక్కకుండా పార్లమెంటు ప్రసారాలను నిలిపివేసి, ద్వారాలు మూసివేసి బిల్లును ఆమోదించారు. నాడు బిల్లును వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిని సస్పెండ్‌ చేశారు. బిల్లు పాస్‌ అవడంతో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరు చేశారు. విభజన బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు.

ఈ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇతర హామీలను నెరవేర్చడంతోపాటు ప్రత్యేక హోదాను వర్తింపజేస్తామని చెప్పారు. అప్పటి ప్రతిపక్షాలు దీనికి మద్దతుగా నిలిచాయి. వెంకయ్యనాయుడు అదే సందర్భంలో ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు సరిపోదని, పదేళ్లపాటు వర్తించేలా ఇవ్వాలని విన్నవించారు. పరిశ్రమలు స్థాపించడానికే మూడు నాలుగేళ్లు పడుతుందని, అందువల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం అందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు షరతుతో టీడీపీ సహా అధికార, ప్రతిపక్షాలు బిల్లును ఆమోదింపజేసుకున్నాయి.

మార్చి 2, 2014న సమావేశమైన కేంద్రమంత్రి మండలి ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా తిరుపతిలో జరిగిన సభలో నరేంద్ర మోదీ, చంద్రబాబుతో కలిసి ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకేసి హోదాను 15 ఏళ్లపాటు వర్తింపజేయాలని, తద్వారా రాష్ట్రం తగిన విధంగా పరిహారం పొందగలదని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచాయి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను భుజాన వేసుకున్న బీజేపీ, టీడీపీలు అకస్మాత్తుగా ఆ అంశంపై నీళ్లు చల్లాయి. చంద్రబాబునాయుడి అండతోనే హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సాయం (స్పెషల్‌ ప్యాకేజీ)ని తెరపైకి తెచ్చారు. ఈ ప్యాకేజీ కేవలం నామమాత్రమే..’ అని ఆ లేఖలో జగన్‌ పేర్కొన్నారు.

మా పోరాటంపై కేంద్రం స్పందించలేదు
‘ప్రత్యేక హోదా సాధించేందుకు నాలుగేళ్లుగా మేం చేసిన పోరాటం ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలు కాపాడడమే మా పార్టీ ప్రథమ కర్తవ్యం అయినందున మార్చి 16వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు నోటీసులు ఇచ్చాం. అయితే, దురదృష్టవశాత్తూ సభ సజావుగా లేదన్న కారణం చూపుతూ ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత మరో 12 నోటీసులు వరుసగా ఇచ్చినప్పటికీ వాటికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మిగిలి ఉన్న బడ్జెట్‌ సమావేశాలు కాస్తా ఈ ఆందోళనల మధ్యే ముగిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మేం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫలితం ఇవ్వలేదు.

ప్రజాస్వామ్య దేవాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై వ్యవహరించిన తీరుతో పార్లమెంటుపై ఏపీ ప్రజల విశ్వాసం చెదిరిపోయింది. దీంతో చివరగా మా పార్టీ లోక్‌సభ సభ్యులు ఐదుగురు రాజీనామాలు సమర్పించారు. రాజీనామా చేసి ఈ ఐదుగురు ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీక్షలో ఉన్న ఎంపీలను పోలీసులు దీక్షాస్థలి అయిన ఏపీ భవన్‌ నుంచి ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు. విభజనకు ముందస్తు షరతుగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోని పక్షంలో ప్రజలకు మొత్తంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంపోతుంది. ఇది ప్రపంచంలోనే పేరున్న మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అందువల్ల మీరు జోక్యం చేసుకుని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. హోదా లేనిపక్షంలో ఏపీ ఎన్నటికీ అభివృద్ధి సాధించజాలదు..’ అని వైఎస్‌ జగన్‌ అందులో పేర్కొన్నారు.

హోదా ఇవ్వకపోవడానికి వాళ్లు చూపుతున్న కారణాలివే..
1. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని చెప్పారు. కానీ, ఇప్పటికీ 11 రాష్ట్రాలు హోదా ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాయి. ప్రత్యేక హోదా వ్యవస్థను కమిషన్‌ ఏ రాష్ట్రానికీ నిరాకరించలేదని ఇటీవలే పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్‌ సేన్, గోవిందరావు లిఖితపూర్వకంగా స్పష్టంచేశారు. 

2. అప్పటి కేంద్రమంత్రి మండలి మార్చి 2, 2014న ఏపీకి ప్రత్యేక హోదాను వర్తింపజేస్తూ తీర్మానించడమే కాకుండా దానిని అమలుచేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. జనవరి 1, 2015న నీతిఆయోగ్‌ ఉనికిలోకి వచ్చింది. నీతిఆయోగ్‌ వచ్చే నాటికి అంటే పది నెలలుగా ప్రణాళిక సంఘానికి అందిన ఆదేశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జూన్‌ 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు నెలల వరకూ ప్రణాళిక సంఘం ఉన్నా ఆ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీలో అధికార టీడీపీ కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా.. మంత్రివర్గంలో ఉండి ఈ అంశాన్ని ప్రణాళిక సంఘంతో చర్చించలేదు. 

3. పదమూడో ఆర్థిక సంఘం అమలులో ఉన్న కాలంలో మార్చి 2, 2014న కేంద్ర కేబినెట్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించిన తరువాత పద్నాలుగో ఆర్థిక సంఘంపై నెపాన్ని ఎలా నెడతారు? పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసులు ఏప్రిల్‌ 1, 2015న అమలులోకి వచ్చాయి. పైగా పద్నాలుగో ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఏనాడూ చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి హోదా ఇవ్వకుండా ఉండడానికి సాకులు వెతుకుతున్నారు.  

4. ప్రత్యేక హోదా కలిగి ఉన్న రాష్ట్రాలు హోదావల్ల ఎలాంటి ఉపాధిని సృష్టించలేదని, ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేదని చెబుతున్నారు. కానీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ తదితర ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు వేలాది పరిశ్రమలను, తద్వారా లక్షలాది ఉద్యోగాలను సృష్టించగలిగాయి. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన సమాధానమే. వందశాతం ఆదాయ పన్ను, జీఎస్టీ మినహాయింపులు, విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ తదితర ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు కలిగి ఉండడంవల్లే హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు వచ్చాయి. ఈ ప్రోత్సాహకాలు ఇవ్వనిపక్షంలో మా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు సహేతుకమైన ప్రాతిపదిక ఏముంది? ఈ ప్రోత్సాహకాలు లేనిపక్షంలో.. హైదరాబాద్‌ను కోల్పోయిన మా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఎలా దక్కుతాయి?

5. విభజన జరిగిన నాడు మా రాష్ట్రానికి రూ.97వేల కోట్ల అప్పును చూపారు. 60 ఏళ్లపాటు వృద్ధిచెందిన అప్పు ఇది. గడిచిన నాలుగేళ్లలో మా రాష్ట్రం అదనంగా రూ.1.20 లక్షల కోట్ల మేర అప్పు తెచ్చింది. మొత్తంగా రాష్ట్రంపై రూ.2.20 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. ఇంత అప్పుతో, పరిశ్రమలు లేకుండా, హోదా లేకుండా మా రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదు? ఇలాంటి నేపథ్యం ఉన్న ఈ తరుణంలో సీఎం ఏపీ ప్రగతి పథం లో దూసుకుపోతోందని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించా మని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వాస్తవానికి దీనికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. హోదా మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లగలదు..’ అని వైఎస్‌ జగన్‌ ఆ లేఖలో వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top