
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ భారతీరెడ్డి
పులివెందుల రూరల్ (వైఎస్సార్ జిల్లా): రాష్ట్రంలోని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరిగుట్టలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని, ఐదేళ్ల పాలనలో ఆయన చేసిందేమి లేదని విమర్శించారు. టీడీపీది అవినీతి పాలన అని దుయ్యబట్టారు.
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్సార్‌సీపీతోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోయినా రాష్ట్రంలోని సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండుగడుతూ జగన్ ప్రజల మధ్యనే ఉంటున్నారని ఆమె తెలిపారు. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు.