సమాచార కమిషనర్లుగా టీడీపీ కార్యకర్తలా?

Vijayasai Reddy Comments On TDP - Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎంపీ వి.విజయసాయిరెడ్డి లేఖ 

వ్యాపారాలు, లాభసాటి పదవుల్లో ఉన్నవారు అనర్హులు

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా నియామకాలను ఆపాలని విజ్ఞప్తి  

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామక ప్రతిపాదనపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి (జీపీఎం, ఏఆర్‌)లకు వేర్వేరుగా ఆయన శుక్రవారం లేఖలు రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని స్పష్టం చేశారు. లేఖలో ఏం రాశారంటే..

చట్టం చెబుతున్నదేమిటి? చేసిందేంటి?
‘సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఒకరు విజయవాడకు చెందిన హోటల్‌ వ్యాపారి ఐలాపురం రాజా కాగా మరొకరు విద్యా శాఖ మంత్రి ప్రైవేట్‌ కార్యదర్శి, గ్రామాధికారుల సంఘం నాయకుడైన ఇ.శ్రీరామమూర్తి. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు. ఆర్టీఐ చట్టం (2005) సెక్షన్‌ 15 ప్రకారం నియామకాలన్నీ సమాచార కమిషన్‌ నిబంధనావళి ప్రకారమే జరగాలి. చట్టంలోని 5వ సబ్‌సెక్షన్‌ ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యే వ్యక్తులు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి. న్యాయ, శాస్త్ర, సాంకేతిక, సేవా, యాజమాన్యం (మేనేజ్‌మెంట్‌), జర్నలిజం, మాస్‌ మీడియా, ప్రభుత్వ, పరిపాలనా రంగాలలో విస్తృత పరిజ్ఞానం, అనుభవజ్ఞులై ఉండాలని చట్టం చెబుతోంది.

సబ్‌ సెక్షన్‌–6 ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు ఎంపీలుగా లేదా ఎమ్మెల్యేలుగా ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండకూడదు. లాభసాటి పదవులు నిర్వహించి ఉండకూడదు. ఏదైనా వ్యాపారంలో ఉండకూడదని 6వ సబ్‌ సెక్షన్‌ స్పష్టం చేస్తోంది. పై నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఇద్దరూ సమాచార కమిషనర్లుగా అనర్హులు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వీరిద్దర్నీ ఎలా ప్రతిపాదించింది? ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి, సీనియర్‌ క్యాబినెట్‌ మినిస్టర్‌ (ప్రతిపక్ష నాయకుడు గైర్హాజరయినపుడు)తో కూడిన కమిటీ వీరి పేర్లకు అనుమతి ఇచ్చింది? వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్‌ ఆమోదించినట్టు, ఇ.శ్రీరామమూర్తి పేరుకు అభ్యంతరం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన రాలేరని తెలిసి కూడా కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించింది. రాజకీయ దురుద్దేశపూర్వకంగా జరిగింది. 

కొత్త ప్రభుత్వం వచ్చేవరకు ఆపండి
ఆర్టీఐ కమిషనర్లను నియమించకుండా నాలుగేళ్లు వేచి చూసిన ప్రభుత్వం ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న సమయంలో హడావుడిగా నియమించాల్సిన అవసరం ఏమిటి? వీరి పేర్లను గవర్నర్‌ ఆమోదం కోసం పంపే ముందు ఎన్నికల కమిషన్‌ అనుమతి పొంది ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నాం. ఏ పరిస్థితుల్లో గవర్నర్‌ ఇలా వ్యవహరించారో తెలియడం లేదు. రాష్ట్ర సమాచార కమిషన్‌లో రాజకీయపరమైన నియామకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2017లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆరుగురిని సమాచార కమిషనర్లుగా నియమించినప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో నియామకాలకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ నియామకాలను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top