రూ.15 వేల కోట్ల పచ్చనోట్లు సిద్ధం

Vijaya Sai Reddy appealed Telangana people about TDP - Sakshi

వచ్చే ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు రెడీ చేసిన చంద్రబాబు

జాతీయ వాటాగా కాంగ్రెస్‌కు రూ.5 వేల కోట్లు 

తెలంగాణకు రూ.1,200 కోట్లు పంపింణీ

ఎవరి ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నాడో త్వరలోనే బయటపెడతా.. 

ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం

విజయవాడలో వంతెన కట్టలేని వ్యక్తి.. హైదరాబాద్‌ కట్టానంటే ఎలా నమ్ముతారు?

టీడీపీని దగ్గరకు రానీయొద్దని తెలంగాణ ప్రజలకు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ రూ.15 వేల కోట్లు సిద్ధం చేశారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ‘పచ్చ’నోట్ల వర్షం కురిపించడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేశారన్నారు. దేశ వ్యాప్తంగా పంచడం కోసం రూ.5 వేల కోట్లు ఇస్తానంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చంద్రబాబు ప్రామిస్‌ చేశాడని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కోసం నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రూ.1,200 కోట్ల వరకూ తరలించారని ఆరోపించారు. అలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం రూ.500 కోట్ల చొప్పున పంపించిన విషయం కూడా చాలామంది నాయకులకు తెలుసన్నారు. ఈ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానని, ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. దీన్ని సాకుగా చూపించి.. తనపై దాడులకు దిగినా బెదిరే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌కున్న అనుబంధం ఏమిటి? డీల్‌ ఏమిటి? దాని విలువ ఎంత? అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.  

అజ్ఞాత వ్యక్తులు, ఉన్నతాధికారుల సహకారంతో.. 
రేవంత్‌రెడ్డిని టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎందుకు పంపించారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. లోకేశ్‌తో ఉన్న రాజేశ్, శ్రీనివాస్, మరో అజ్ఞాతవ్యక్తి గోపి, యరపతినేని శ్రీనివాసరావు, సుబ్బారావు వీళ్లంతా డబ్బులు ఎలా తరలించబోతున్నారో త్వరలోనే ప్రజలకు వివరిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. దీనికి ఉన్నతాధికారులైన ఆర్పీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు, సతీశ్‌చంద్ర, సాయిప్రసాద్‌తో పాటు సీఎం పేషీలో పనిచేస్తున్న మరికొందరు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. కాగా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన రాహుల్‌గాంధీకి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం అవసరమైతే ఉగ్రవాదులతో కూడా పొత్తులు పెట్టుకోగల ద్రోహి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.  

టీడీపీని ఓడించండి..
విజయవాడలో నాలుగేళ్లుగా ఓ వంతెన కట్టలేని చంద్రబాబు.. హైదరాబాద్‌ను తానే నిర్మించానని, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును తానే కట్టానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు తమ మనస్సాక్షి ప్రకారం ఓట్లు వేయాలని.. టీడీపీని మాత్రం దగ్గరకు రానీయొద్దని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, వెలగపూడి రామకృష్ణబాబు, ఠాకూర్, వెంకటేశ్వరరావుల పాత్ర లేకపోతే.. ఒక నిష్పాక్షిక సంస్థ ద్వారా దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదో చెప్పాలన్నారు.

జనసేనను మేం పార్టీగానే గుర్తించడం లేదు..
2014 ఎన్నికలప్పుడు ప్యాకేజీ తీసుకుని కాల్షీట్లు ఇచ్చినట్టుగానే.. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అమ్ముడుపోతున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జనసేనను ఒక పార్టీగా తాము గుర్తించడం లేదని, టీడీపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మళ్ల విజరయప్రసాద్, తైనాల విజయకుమార్, ఎంవీవీ సత్యనారాయణ, కరణం ధర్మశ్రీ, వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, డాక్టర్‌ పీవీ రమణమూర్తి, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top