ఎన్నికల అధికారులపైనా నిఘా

Vigilance on election officials - Sakshi

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేవలం అభ్యర్థులపైనే కాకుండా జిల్లా, నియోజకవర్గ, బూత్‌ స్థాయిల్లోని ఎన్నికల అధికారులు, సిబ్బందిపై సైతం నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ పౌర సమాజానికి పిలుపునిచ్చారు. తీవ్ర ఒత్తిళ్ల మధ్య క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో జిల్లాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు గురువారం ఇక్కడ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సీఈవో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కేవలం ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగానిదే కాదని, పౌర సమాజం కూడా తన వంతు పాత్ర పోషించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రజ్వాసామ్యం హైజాక్‌కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఎన్నికల అక్రమాల నిరోధం కోసం స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు నిఘా ఉంచి ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు సమాచారమివ్వాలని సూచించారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటుందన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేని అమాయకులను పోలీసులు అకారణంగా బైండోవర్‌ చేస్తే జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పొందుపర్చాల్సి ఉందని, అయితే చాలామంది తమ నేర చరిత్రను దాచి పెడుతున్నారని పేర్కొన్నారు. నేరచరిత్రను దాచిపెట్టే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సమాచార హక్కు ద్వారా పోలీసు శాఖ నుంచి అభ్యర్థుల నేర చరిత్ర సమాచారాన్ని సేకరించి, వారి ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారంతో పోల్చి చూస్తామన్నారు. ఎవరైనా తప్పుడు వివరాలిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top