
కాస్మెటిక్స్‌లో పాదరసం స్థాయిపై కఠిన నిఘా
పర్యావరణానికీ, ఆరోగ్యానికీ ప్రమాదకారి
పరిమితికి మించి పాదరసం ఉన్న సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ.) నేతృత్వంలోని కమిటీ ఒకటి.. పాదరసం కలిసిన సౌందర్య సాధనాల ఉత్పత్తులపై నివేదికను సమర్పించింది. ఈ విషయాన్ని జూన్17న జరిగిన సమావేశం మినిట్స్‌లో డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ధ్రువీకరించింది. చట్టప్రకారం కాస్మెటిక్స్‌లో పాదరసం నిర్దేశిత మోతాదుపై ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. సౌందర్య సాధనాల తయారీపై నిఘాను కఠినతరం చేయనుంది. అసలింతకీ ప్రమాదకర లక్షణాలు పాదరసంలో ఏమున్నాయి.. ఇంతకూ దాన్ని సౌందర్య సంబంధ ఉత్పత్తుల్లో ఎందుకు వాడతారు? – సాక్షి, స్పెషల్ డెస్క్
భారత్‌లో కాస్మెటిక్స్ అన్నది సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం. అమ్మకాల పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మార్కెట్ మనది. చాలా సౌందర్య సాధనాల్లో స్వల్ప స్థాయుల్లో పాదరసం వినియోగిస్తారు. అయితే పాదరసం మానవ ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ రెండింటినీ ప్రభావితం చేసే విషపూరిత మూలకం. అందుకే కాస్మెటిక్స్ తయారీలో ఈ లోహం వాడకాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
2013 ‘మినామాటా కన్వెన్షన్ ’..:
పాదరసం, పాదరస సమ్మేళనాల హానికర ప్రభావాల నుండి మానవాళిని, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో 2013లో జపాన్ వేదికగా ‘మినామాటా కన్వెన్షన్ ’ (మినామాటా అంతర్జాతీయ ఒప్పందం) కుదిరింది. దాని ప్రకారం సౌందర్య సాధనాలలో 1 పీపీఎం (ఒక పార్ట్స్ పర్ మిలియన్ – అంటే 0.0001 శాతం) కంటే ఎక్కువ పాదరసం ఉండకూడదు.
ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పరిమితి దాటి పాదరసం ఉన్న కాస్మెటిక్స్ ఎగుమతులను, దిగుమతులను, తయారీని, ఇంకా ఇతర లోపాలను గుర్తించేందుకు డీసీజీఐ 2024లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. మనదేశంలోని ప్రస్తుత కాస్మెటిక్స్ చట్టం.. ‘మినామాటా కన్వెన్షన్ ’ ఒప్పందానికి లోబడే ఉందని ఆ ఉపసంఘం నివేదిక పరిశీలించిన డీసీసీ స్పష్టం చేసింది.
దిగుమతులే ఆధారం
మనదేశం పాదరసం విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో మనదేశం 32.77 లక్షల డాలర్ల విలువైన 73,085 కిలోల పాదరసం దిగుమతి చేసుకుంది. మనకు ఎగుమతి చేసే ప్రధాన దేశాలు పెరు, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, యూకే. మనదేశ నిబంధనల ప్రకారం కంటి ప్రాంతంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులలో కలిపే పాదరసం స్థాయి 70 పీపీఎంలకు (అంటే 0.007 శాతం) మించకూడదు. ఇతర సౌందర్య సాధనాలలో ఇది 1 పీపీఎంను దాటకూడదు.
అన్ని రంగాల నిపుణులతో..
‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేసిన సిఫారసుల కమిటీకి చైర్మన్‌గా – ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎన్. భట్టాచార్య, సభ్యులుగా ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగాల వైద్య నిపుణులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందినవారు ఉన్నారు.
‘అందానికి’ పాదరసం ఎందుకు?
పాదరసాన్ని సాధారణంగా చర్మాన్ని తెల్లగా చేసే ఉత్పత్తుల్లో వాడతారు. చర్మాన్ని కాంతిమంతం చేసే క్రీములు; చర్మంపై చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలను పోగొట్టే సౌందర్య సాధనాలు; వయసును కనపడనీయని యాంటీ–ఏజింగ్ సొల్యూషన్ లు, ఇంకా కొన్ని రకాలైన మేకప్ పదార్థాలు.. పాదరసాన్ని కాస్తయినా కలపకుండా తయారు కావు. చర్మం రంగు నల్లగా ఉండటానికి చర్మంలోని ‘మెలనిన్’ కారణం. పాదరసం ఆ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా నల్లదనం తగ్గుతుంది. అలాగే పాదరసం కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లను చంపగలదు. కొన్ని సౌందర్య సాధనాలలో సంరక్షణకారిగానూ ఉపయోగపడుతుంది.
చాలా ప్రమాదకరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ పాదరసాన్ని అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 రసాయనాల జాబితాలో చేర్చింది. పాదరసం కలిసి ఉన్న కాస్మెటిక్స్‌ను దీర్ఘకాలం వాడటం వల్ల మూత్ర పిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పాదరసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదరసం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
» ఒంటిమీద దద్దుర్లు, రంగు పోవడం
» జీర్ణ సంబంధమైనవి
» వ్యాధి నిరోధక శక్తి తగ్గడం
» ఆందోళన, ఒత్తిడి
» నాడీ సంబంధమైనవి
» జ్ఞాపకశక్తి సమస్యలు
» భావోద్వేగాల్లో అనూహ్యమైన మార్పులు
భారీగా పెరిగిన కాలుష్యం
పాదరస ఉద్గారాలు 1960తో పోలిస్తే 2021లో 3.3 రెట్లు పెరిగాయి. మొత్తం ఉద్గారాల్లో చైనా, భారత్, ఇండోనేషియా, పెరు, బ్రెజిల్‌ల వాటా దాదాపు 50 శాతం. – ప్రపంచంలో అత్యధిక పాదరస కాలుష్యానికి కారణమవుతున్న దేశం చైనా. ఆ తరవాతి స్థానంలో మనదేశం ఉంది.
» బంగారు ఆభరణాల తయారీలో, బంగారం తవ్వకాలు వంటి వాటిలో పాదరసాన్ని విరివిగా వినియోగిస్తారు.
» కొన్ని రకాల పరిశ్రమలు, సిమెంటు తయారీ, ఈ–వేస్ట్ వంటి చెత్తను కాల్చడం, బొగ్గును కాల్చడం.. ఇలా పాదరసం అనేక కారణాల వల్ల వాతావరణంలోకి చేరుతోంది.
ఇలా చూసుకోవచ్చు
|మనం కొనే ఉత్పత్తుల్లో మెర్క్యురస్ క్లోరైడ్, క్యాలొమెల్, మెర్క్యురిక్ అయోడైడ్ అనే పేర్లు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇవన్నీ పాదరస సంబంధమైనవే.