తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని ఓడిస్తాం: హరీష్‌

TRS Leader Harish Rao Slams Congres In Sanga Reddy - Sakshi

సంగారెడ్డి : అందరం కలిసి పని చేసి తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని ఓడిస్తామని భారీ నీటిపారుదల శాఖా మంత్రి, టీఆర్‌ఎస్‌ అగ్రనేత హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో అసమ్మతినేత సత్యనారాయణ, ఇతర ముఖ్య కార్యకర్తలతో మంత్రి హరీష్‌ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..సంగారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన సత్యనారాయణతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అనైతిక పొత్తులు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు అభివృద్ధికి, అవకాశవాద రాజకీయాలకు మధ్య జరుగుతున్నాయని అభివర్ణించారు.

గత మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని కూడా అమలు చేయని ఘనత కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలన, నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలనే అడుగుదామన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ బురద రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా మిర్యాలగూడలో యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు అధికారంలోకి రాగానే మూసేస్తామని ప్రకటించారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కోమటిరెడ్డి ప్రకటన వ్యక్తిగతమా..లేక పార్టీ విధానమా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇవ్వడంతో కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. పరాయిపాలన, చీకటి తెలంగాణే కాంగ్రెస్‌ విధానమా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నారాయణఖేడ్‌ అసమ్మతి నాయకుడు ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కూడా మాట్లాడామని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10కి 10 స్థానాలు గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని జోస్యం చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top